ATM On Wheels | ఇక.. కదిలే రైళ్లలోనూ ATM సేవలు..!

  • By: sr    news    Apr 16, 2025 6:46 PM IST
ATM On Wheels | ఇక.. కదిలే రైళ్లలోనూ ATM సేవలు..!

విధాత : భారతీయ బ్యాకింగ్ సేవల్లో ఏటీఎం(ATM)లు తెచ్చిన మార్పు అంత ఇంత కాదు. వీటికి అప్డేట్ గా డిజిటల్ పేమెంట్లు వచ్చినా ఏటీఎంల సేవలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో, రహదారుల వెంట ఏటీఎం సేవలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా దేశంలో కదిలే ఏటీఎం (ATM On Wheels)లు కూడా రానున్నాయి.

అంటే రైలు ప్రయాణికుల కోసం రైళ్లలోనూ తొలిసారిగా ఏటీఎం సేవలను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా ప్రయోగాత్మకంగా సెంట్రల్‌ రైల్వే (Central Railway) ముంబయి-మన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ లో ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

పంచవటి ఎక్స్‌ప్రెస్‌ ప్రతి రోజూ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినస్‌ నుంచి మన్మాడ్‌ జంక్షన్‌ వరకూ వెళ్తుంది. సుమారు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలులో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలను తీసుకొచ్చారు. ప్రతి రోజు నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ఏసీ చైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా వెల్లడించారు.

కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దీనికి షట్టర్‌ డోర్‌ను కూడా అమర్చారు. ఇందుకు సంబంధించి కోచ్‌లో అవసరమైన మార్పులను మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేపట్టినట్లు అధికారులు వివరించారు.