Pakistan: బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..12 మంది పాక్ సైనికులు హతం

  • By: sr    news    May 08, 2025 8:05 PM IST
Pakistan: బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..12 మంది పాక్ సైనికులు హతం

విధాత: పాకిస్థాన్ ఆర్మీకి దెబ్బమీద దెబ్బ పడుతుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ తో మెరుపు దాడులు చేసి పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 100మంది వరకు ఉగ్రవాదులను మట్టుబెట్టి షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి పాక్ ఆర్మీ కోలుకోకముందే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మరో గట్టి షాకిచ్చింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాక్ ఆర్మీ వాహనం లక్ష్యంగా ఐఈడీ దాడికి పాల్పడింది. ఈ పేలుడుతో 12మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు

. కుచ్చి జిల్లాలోని మాచ్ జనరల్ ఏరియాలో బలూచిస్తాన్ లిబరేషన్ వేర్పాటువాదులు పాకిస్తాన్ భద్రతా దళాల వాహనాన్ని ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ)తో లక్ష్యం చేసుకున్నారని పాకిస్థాన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పేలుడు లో ఆర్మీ వాహనంలో ఉన్న 12 మంది సైనికులు మరణించారని, వారిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారని పాక్ ఆర్మీ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ పేలుడులో వాహనం కూడా ధ్వంసమైంది.

ఈ ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నిర్మూలించడానికి ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం తెలిపింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా దాడులు చేస్తోంది. సైనిక వాహనాలు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనుబంధ విభాగం స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీవోఎస్) బోలన్‌లోని మాచ్ కుంద్ ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీ దాడికి పాల్పడింది.