Banakacharla Project | తెలంగాణను ఎడారిగా మార్చేందుకు చంద్రబాబు కుట్ర : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

Banakacharla Project | చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను తరలించి, తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ ఆయన చంద్రబాబుపై తీవ్రంగా మడ్డిపడ్డారు. గోదావరి, బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేదన్నారు. కృష్ణా నది నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, గోదావరి విషయంలోనూ అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. గోదావరి, బనకచర్లపై క్యాబినెట్‌లో సీరియస్ చర్చ జరగలేదని తెలిపారు.
గోదావరి, బనకచర్లపై అన్ని పార్టీలు తెలంగాణలో ఏకం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడును చర్చలకు పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పనికిమాలిన చర్య అని ఫైర్ అయ్యారు. చంద్రబాబుతో చర్చలు చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఒక వర్గం మీడియా ప్లాన్ ప్రకారం తెలంగాణలో రాజకీయ పార్టీల పంచాయతీగా గోదావరి జలాల అంశాన్ని చూపెడుతున్నదని అసహనం వ్యక్తం చేశారు. గోదావరి నదీ జలాలు తెలంగాణ బతుకుదెరువు అంశం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సరైన మార్గంలో లేవని చెప్పారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు గోదావరి జలాల అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణకు నీళ్లు దొరకుండా రూ. 80 వేల కోట్లతో చంద్రబాబు నీళ్లను తీసుకువెళ్తున్నారన్నారు. మోదీకి చంద్రబాబు ఊపిరిగా మారారని, బాబు అవసరం బీజేపీకి ఉందన్నారు జగదీష్ రెడ్డి. చంద్రబాబును చర్చలకు పిలవడం అంటే మీరు దాసోహం అన్నట్లే అని అన్నారు. ప్రభుత్వం కార్యాచరణ తీసుకొకపోతే ప్రజలను కలుపుకుని రాజకీయ పార్టీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు జగదీష్ రెడ్డి.