Banakacharla | బనకచర్ల వద్దే వద్దు! రాయలసీమ ఎత్తిపోతల కూడా..
పోలవరం, బనకచర్ల లింకేజ్ ప్రాజెక్టును, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆలోచన పరుల వేదిక డిమాండ్ చేసింది.

- ప్రాజెక్టులు.. ప్రజల కోసం నిర్మించాలి
- పెండింగ్ ప్రాజెక్టులు సత్వర టార్గెట్
- వాటన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేయాలి
- సర్కార్‌కు ఆలోచనాపరుల వేదిక హితవు
- ఫలప్రదంగా ముగిసిన ప్రాజెక్టుల యాత్ర
Banakacharla | పోలవరం, బనకచర్ల లింకేజ్ ప్రాజెక్టును, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆలోచన పరుల వేదిక డిమాండ్ చేసింది. “ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి” అన్న నినాదంతో ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 4 నుండి 6 వరకు శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ప్రాజెక్టుల యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్శన యాత్ర ఫలప్రదంగా ముగిసిందని ఆలోచనపరుల వేదిక తరఫున రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రైతు సేవా సమితి అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల రంగం విశ్లేషకులు టీ లక్ష్మీనారాయణ, నల్లమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు కృష్ణమూర్తినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
వెలిగొండ మొదలుపెట్టి ముప్పయ్ ఏళ్ళు!
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 30 ఏళ్లలో దాదాపు రూ.6,000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ప్రతినిధులు తెలిపారు. నిర్మాణం పూర్తి కాకుండానే 2024 మార్చి నెలలో నాటి ముఖ్యమంత్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. 2026 జూన్, జూలై నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి 1,19,000 ఎకరాలకు నీరందిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే.. అది సాధ్యం కాదని ప్రతినిధి బృందం తెలిపింది. మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయడానికే రూ.2000 కోట్లకు పైగా ఇంకా వెచ్చించాల్సి ఉన్నదని అధికారులు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. రెండో దశలోని 3,28,300 ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి మరో రు.2500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ అంచనా వ్యయం పెరుగుతుంది. 1996లో అంచనా వ్యయం రూ.978.96 కోట్లు. అది కాస్తా ప్రస్తుతం రూ.10,200 కోట్లకు హనుమంతుని తోకలా పెరిగిపోయిందని తెలిపారు. రూ.8,043.85 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఖర్చు చేసిన మొత్తానికి వడ్డీ లెక్కగట్టితే, లేదా, ద్రవ్యోల్బణం కోణంలో ఆలోచించినా వ్యయం చేసిన మొత్తం కనీసం రు.10,000 కోట్లు అవుతుందని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన, కరవు పీడీత మరియు ప్లోరైర్డ్ బాధిత ప్రాంతానికి సాగు, తాగునీటిని అందించి, అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వారు కోరారు. దాదాపు రూ.5000 కోట్లు కేటాయించి, అన్ని పనులు సమాంతరంగా చేస్తే, ఇప్పటి దాకా చేసిన ఖర్చుకు ఫలితం ఉంటుందని తెలిపారు.
బనకచర్ల మరో వృథా ఖర్చు
శ్రీశైలం జలాశయం వద్ద నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తితే సహజ ప్రవాహం (గ్రావిటి) ద్వారా 16.5 కి.మీ. దూరంలో ఉన్న బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు కృష్ణా నీళ్ళు వస్తున్నాయి. ఈ వాస్తవాన్ని మరుగుపరచి పోలవరం నుండి బనకచెర్లకు భారీ ఎత్తిపోతల ద్వారా సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తు నుండి ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయరు తర్వాత +340 మీటర్ల మేర ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, నల్లమల అడవుల్లో 26 కి. మీ. సొరంగ మార్గాన్ని, 23,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వి, పోలవరం నుండి 400 కి.మీ. దూరంలో +265 మీటర్ల ఎత్తులో ఉన్న బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు చేర్చి, తెలుగు గంగ మరియు గాలేరు – నగరికి నీళ్ళిచ్చి, మిగిలిన నీటిని కుందూ నది ద్వారా పెన్నా నదికి చేర్చి, సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న సోమశిల రిజర్వాయరుకు చేర్చుతారట. దాని కోసం 4500 మెగావాట్ల విద్యుత్తును వినియోగిస్తారట. ఈ పథకానికి అయ్యే నేటి వ్యయ అంచనా రు.82,000 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. నీరు ఎత్తిపోసి మళ్ళీ క్రిందకు ఎవరైనా పారబోస్తారా? ప్రజలు రాజకీయ అనుబంధాలకు అతీతంగా, హేతుబద్ధంగా ఆలోచించాలి. ఈ పథకం ప్రతిపాదనతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రమించిన నీటి హక్కులకు ప్రమాదం ముంచుకొస్తున్నది’ అని ప్రతినిధులు తెలిపారు. వాటిని పరిరక్షించుకోవడానికి ప్రజలు పూనుకోవాలని ఆలోచనాపరుల వేదిక విజ్ఞప్తి చేసింది.
ఇవీ కీలక సూచనలు
(1) రు.82,000 కోట్ల చిత్తు లెక్కతో ప్రతిపాదిస్తున్న పోలవరం – బనకచెర్ల ప్రాజెక్టును విరమించుకోండి.
(2) ఇంకో రు.3000 కోట్లు వృధా అయ్యే, గత ప్రభుత్వం ప్రారంభించి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇంతటితో ఆపేయ్యండి. ఇప్పటికే ఖర్చు చేసిన రు. 750 కోట్లను రుషికొండ పద్దులో కలిపెయ్యండి.
(3) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీలో భాగంగా రు. 10,000 కోట్లు EAP ద్వారానో, మరొక విధంగానో తీసుకురండి. దాంతో రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల పనులూ, అఖరు ఎకరం దాకా సమాంతరంగా పరిగెత్తించి పూర్తి చేయండి. తద్వారా సుమారు 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి, లక్ష కోట్లు సంపద, 10 లక్షల ఉపాధి సృష్టించిన వారవుతారు.
ఇవి కూడా చదవండి..
Banakacherla Project| బనకచర్ల ప్రాజెక్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్‌తో సరి!
Banakacharla | ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఉచిత పథకాలకంటే డేంజర్.. బనకచర్ల!
Banakacharla Project | బనకచర్ల చుట్టూ రెండు రాష్ట్రాల రాజకీయాలు!
Banakacharla Project | సీమకు కావాల్సింది గోదావరి కాదు.. కృష్ణా జలాలే!