Holi With Coconuts | అక్కడ లక్షల్లో.. కొబ్బరికాయలు కాల్చి మరి హోలీ! ఎక్కడంటే?
Holi With Coconuts |
భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాలున్నాయి. ఏడాది పొడువునా అనేక పండుగలను జరుపుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాల మేరకు ఒక్కో పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హోలీ పండుగ సంబురాల్లో యావత్ దేశం మునిగి తేలుతుంది. హోలీకి ముందు హోలికా దహన్ (కామదహనం) సైతం ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. హోలీకి ముందురోజు చాలా చోట్ల హోలికా పూజ, సాయంత్రం హోలికా దహనం చేస్తుంటారు. హోలికను కాల్చేందుకు కట్టెలు, ఆవుపేడ సేకరించి ప్రధాన కూడళ్లలో దహనం చేస్తుంటారు. అయితే, ఒక ప్రాంతంలో హోలికను కొబ్బరికాయలతో కాలుస్తుండడం ఆనవాయితీగా ఉన్నది. ఈ సంప్రదాయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఏటా నిర్వహిస్తూ వస్తుంటారు. ఉదయ్‌పూర్ కర్కెలా ధామ్‌లో కొబ్బరితో నిర్వహించే హోలీ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
కొబ్బరితో హోలీ అంటే.. కాయలతో ఒకరినొకరు కొట్టుకోరు. కేవలం హోలికాకు కొబ్బరికాయలను సమర్పించి హోలీ సంబరాలను జరుపుకుంటారు. కర్కెలా ధామ్‌ను గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పేర్కొంటారు. గిరిజనులు హోలికను తమ కూతురిగా భావిస్తారు. హోలీని ముందుగా కర్కెలా ధామ్‌లో మాత్రమే జరుపుకునే సంప్రదాయం కొనసాగుతున్నది. గిరిజనులు మొదట కర్కెలా ధామ్‌లో హోలీకాను వెలిగిస్తారు. ఆ తర్వాత ఎగిసిపడే మంటలను చూసిన అనంతరం.. మిగతా ప్రాంతాల్లో హోలికా దహన్ నిర్వహిస్తారు.

కర్కెలా ధామ్ ఎత్తయిన కొండపై ఉండడంతో హోలికా దహన్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం కనిపిస్తుంది. ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో హోలీ సంబరాలు మొదలవుతాయి. అయితే, ఇందుకు సంబంధించి ఓ చారిత్రక కథ స్థానికంగా ప్రచారంలో ఉన్నది. కర్కేలా ధామ్ పర్వతంపైనే హిరణ్యకశ్యపుడి సోదరి హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చున్నదని గిరిజనులు విశ్వస్తారు. అప్పుడే శ్రీమహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఒక అద్భుతం చేశాడని, దాంతో హోలిక మంటల్లో కాలిపోయి ప్రహ్లాదుడిని రక్షించాడనే పురాణ కథనం ప్రచారంలో ఉన్నది. దాంతో హోలికాకు వీడ్కోలు చెప్పేందుకు కొబ్బరికాయను అగ్నికి సమర్పిస్తారు. హోళికాకు కొబ్బరికాయను కానుకగా ఇస్తే తమ కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకం. ఏటా లక్షల్లో కొబ్బరికాయలతో హోలీ సమయంలో హోలికా కొబ్బరికాయలను సమర్పిస్తారు.
కొబ్బరికాయలతో పాటు ఎండిన ఆవు పేడ పిడకలను సైతం హోలికా దహన్ కోసం వినియోగిస్తారు. హోలికా దహనం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు. కొబ్బరికాయను తలపై పెట్టుకుని హోలికా దహన్‌లో వేస్తారు. తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడి అగ్నిలో వేస్తే జీవితంలో కష్టాలు, బాధలు కొబ్బరికాయతో పాటు కాలిపోతాయని, జీవితం ఆనందంగా మారుతుందనే నమ్మకం. హోలీ రోజు కొబ్బరికాయను కాల్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం సైతం ఉన్నది. కొబ్బరికాయలను దహనం చేయడం వల్ల పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని చెబుతారు. ఎందుకంటే కొబ్బరి పొగ ఎంత వరకు చేరుతుందో ఆ ప్రాంతంలోని వ్యాధులు నయమై పర్యావరణం శుద్ధి అవుతుందని.. దాంతో మనుషులతో పాటు జంతువులు, పక్షులు ఆరోగ్యంగా ఉంటాయని పేర్కొంటున్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram