KTR | పార్టీ విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితే బాగుంటుంది: కవిత లేఖపై కేటీఆర్

  • By: sr    news    May 24, 2025 1:37 PM IST
KTR | పార్టీ విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితే బాగుంటుంది: కవిత లేఖపై కేటీఆర్
  • పార్టీలో అందరూ సమానమే..
  • ఎవరైనా లేఖలు రాయవచ్చు
  • కవిత లేఖపై స్పందించిన కేటీఆర్
  • మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారు
  • రేవంత్ రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి
  • రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
  • కేసులు.. పదవి కోసమే ఢిల్లీ ప్రదక్షిణలు
  • నాడు ఓటుకు నోటు కేసు.. నేడు సీటుకు రూట్ కేసు

విధాత, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కేటీఆర్ తాజాగా స్పందించారు. ‘‘మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు..సలహాలు సూచనలు ఇవ్వవచ్చన్నారు. పార్టీలో ఎవరైనా..ఏ హోదాలో ఉన్నా.. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగానే మాట్లాడుకుంటే బాగుంటుందని..అందరికి ఇదే సూత్రమని..పరోక్షంగా కవితకు వార్నింగ్ ఇచ్చారు. మా పార్టీలో అందరూ సమానమేనని..అందరం కార్యకర్తలమేనన్నారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది’’ అని..పార్టీ అధ్యక్షునికి ఎవరైనా సూచనలు చేయవచ్చన్నారు. ప్రస్తుతం తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి..శని కాంగ్రెస్ పార్టీ అని వాటిని ఎలా వదిలించాలనేదే మా టార్గెట్ అన్నారు. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండవచ్చని.. అన్ని పార్టీలో ఉంటారన్నారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు బైటపడతారన్నారు.

సీటుకు రూట్ కేసులో రేవంత్ రెడ్డి.. రాజీనామా చేయాలి

యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జీ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు చేర్చడం తెలంగాణకు అవమానకరమని కేటీఆర్ విమర్శించారు. దేశం ముందు తెలంగాణ పరువును రేవంత్ రెడ్డి తీశాడని విమర్శించారు. ఓటుకు నోటుకు కేసు నుంచి రేవంత్ రెడ్డికి బ్యాగ్ మ్యాన్ అని పేరుందన్నారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణంలో ఇరుక్కున్నారని కేటీఆర్ విమర్శించారు. గతంలో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.50కోట్లకు పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి..మూటల ముఖ్యమంత్రిగా మారిపోయాడన్నారు. తెలంగాణ ఏఐసీసీకి ఎటిఎంలా మారిందన్నారు. గతంలో యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్‌కు పాల్పడినప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారని.. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ మేరకే యడ్యూరప్ప రాజీనామా చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని..లేదంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండగానే సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసు పెట్టిందన్నారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నైతికత ఉంటే రేవంత్ రెడ్డిని తొలగించాలన్నారు. కాంగ్రెస్ డిఎన్ఏ లోనే కరప్షన్ ఉందన్నారు. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవటానికి ఢిల్లీ వెళ్ళారని..రాత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ బాసులు రాహుల్ గాంధీ, మోదీ, అమిత్ షా ను ప్రసన్నం చేసుకోవటానికే రేవంత్ 44 సార్లు ఢిల్లీ వెళ్లారన్నారు.

కేంద్రం మౌనం.. ఎందుకో చెప్పాలి

రేవంత్ రెడ్డి అవినీతి విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అవినీతిలో బీజేపీ నేతల భాగస్వామ్యం ఉందనే మాట్లాడటం లేదా అని నిలదీశారు. తెలంగాణలో ఎన్ని స్కాంలు జరుగుతున్న కేంద్రం ఎందుకు స్పందించటం లేదన్నారు. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమేనని..బీజేపీకి నిజాయితీ ఉంటే అమృత్ కుంభకోణం, సివిల్ సప్లైస్ కుంభకోణం, ఆర్ఆర్ ట్యాక్స్‌పై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న స్కాంల పై నెల రోజుల్లో కేంద్రం స్పందిస్తుందా లేదా చూస్తామన్నారు. స్పందించకపోతే మా పార్టీలో చర్చించి కార్యాచరణ చేపడతామని తెలిపారు.

లోట్టపీసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో సాధించిందేమిటంటే బీఆర్ఎస్ పై నిందలు..బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు..ఢిల్లీ బాసులకు వేలకోట్ల చందాలు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని విషయాలు మాట్లాడే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పడం..స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమీషన్ల గురించి మాట్లాడటం..రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదని అనడం..వీటన్నిటి వల్ల ఫ్రస్ట్రేషన్‌లో రేవంత్ రెడ్డి మీడియా మ్యానేజ్‌మెంట్ చేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. మీడియా సంస్థలు ఎంత కాపాడుదామని చూసినా, రేవంత్ రెడ్డి పని అయిపోయిందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు? అదే కేసీఆర్ పేరు ఉంటే రచ్చ రచ్చ చేసేవాళ్ళు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.