IPL: జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపు! ముంబయ్, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు

  • By: sr    news    May 08, 2025 8:35 PM IST
IPL: జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపు! ముంబయ్, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు

IPL:

విధాత: జైపూర్‌ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో బాంబు పెట్టినట్టు బెదిరింపులు కాల్స్ రావడం కలకలం రేపింది. ఈ నెల 16న సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బాంబు బెదిరింపులు రావడంతో
జైపూర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం చుట్టుపక్కల భారీగా భద్రతా బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం లోపల, వెలుపల బాంబు స్వ్కాడ్‌లు తనిఖీలు చేపట్టాయి.

స్టేడియం లోపల ఉన్నవారిని పంపించి, చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించిన జైపూర్‌ పోలీసులు స్టేడియంను, పరిసరాలను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల సరిహద్దులను భారత్ కట్టుదిట్టం చేసింది. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్‌ సరిహద్దును సీల్‌ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. మే 9వ తేదీ వరకు జోధ్‌పుర్‌, బికనేర్‌, కిషన్‌ఘర్‌ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను యాక్టివేట్‌ చేశారు.

ఐపీఎల్ కు పాక్ భారత్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. మ్యాచ్ వేదిక మార్పు

పాకిస్తాన్..భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం భారత్ లోని ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది. ఈ నెల 11న ముంబయ్ ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాల వేదికగా జరుగాల్సిన మ్యాచ్ వేదికను మార్పు చేశారు. ఈ మ్యాచ్ ను ధర్మశాల నుంచి అహ్మదాబాద్ కు మార్చారు. ఈ మేరకు బీసీసీఐ సమాచారం వెల్లడించింది. ఇదే వేదికపై గురువారం సాయంత్రం పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ ను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. మ్యాచ్ కి హాజరయ్యే ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేసి స్టేడియం లోపలికి పంపారు. కాంగ్రా ఎయిర్ పోర్టు కూడా మూసివేశారు. దీంతో మ్యాచ్ తర్వాత… రోడ్డు లేదా రైలు మార్గంలో ఢిల్లీ టీమ్ ఢిల్లీ చేరుకోనుంది. 11న ఢిల్లీ వేదికగా గుజరాత్ తో ఢిల్లీ తలపడనుంది.