IndiGo | ఇండిగో విమానయాన సంస్థలో కుల వివక్ష కలకలం

  • By: TAAZ    news    Jun 23, 2025 9:27 PM IST
IndiGo | ఇండిగో విమానయాన సంస్థలో కుల వివక్ష కలకలం

IndiGo |  కుల వివక్షత జాడ్యం విమాన యాన సర్వీస్ ఉద్యోగులకు కూడా తప్పడం లేదు. ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో కుల వివక్ష ఘటన కలకలం రేపింది. తనను ముగ్గురు ఇండిగో సీనియర్‌ అధికారులు కులం పేరుతో దూషించారని శిక్షణలో ఉన్న దళిత పైలట్‌ అశోక్ కుమార్ (35) ఆరోపించారు. గురుగ్రాంలోని ఇండిగో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి హాజరైన సందర్భంగా అక్కడ కెప్టెన్‌ రాహుల్‌ పాటిల్‌ సహా తపస్ డే, మనీశ్ సహానీలు తనను కులం పేరుతో దూషించారని శిక్షణ పైలట్‌ తెలిపారు.

తనను చమార్, భంగీ వంటి పదజాలంతో దూషించారని..విమానం నడపడానికి, కాక్‌పిట్‌లో కూర్చోవడానికి అర్హత లేదని అవమానించారని బాధితుడు పేర్కొన్నారు. వెళ్లి చెప్పులు కుట్టుకో.. నీ కులవృత్తి అదే కదా.. మా బూట్లు నాకడానికి కూడా పనికిరావంటూ కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తనను మానసికంగా తీవ్రంగా గాయపరిచాయని బాధితుడు వాపోయారు. బాధితుడు అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు అతని సహోద్యోగులు ముగ్గురిపై బెంగళూరు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి గురుగ్రాంకు కేసు బదిలీ చేశారు. గురుగ్రాం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు దర్యాప్తు చేపట్టారు.