Bamboo Biodegradable Plastic | భూమిలో కలిసిపోయే కొత్త ప్లాస్టిక్
చైనాలో శాస్త్రవేత్తలు వెదురు చెక్కతో 50 రోజుల్లో కాలిపోయే బలమైన, ఫ్లెక్సిబుల్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారు చేశారు.

నేల.. నీరు.. తేడా ఏదీ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కాలుష్యమే. కానీ చైనాలోని శాస్త్రవేత్తలు ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారాన్ని చూపించారు. పర్యావరణానికి హాని చేయని కొత్త రకం ప్లాస్టిక్ లాంటి పదార్థాన్ని వీళ్లు తయారుచేశారు. వెదురు చెక్క నుండి బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ను తయారుచేశారు. ఈ కొత్త పదార్థం బలంగా ఉండడమే కాకుండా, 50 రోజులలోపే సహజంగా కరిగిపోతుంది.
చైనాలోని నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. వెదురు లోని ఫైబర్ లో ఉండే సెల్యులోజ్ ను ఉపయోగించి కొత్త రకం బయోప్లాస్టిక్ తయారు చేశారు. ఇది బలం, ఆకారం, వేడి తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాల్లో సాధారణ ప్లాస్టిక్‌లకు ఏ మాత్రం తగ్గదు.
ఎలా తయారుచేశారంటే…
వెదురులోని సెల్యులోజ్ ను ప్రత్యేకమైన ఆల్కహాల్ సాల్వెంట్ తో కరిగించి, దానిలోని అణువుల బంధాలను కొత్తగా ఏర్పడేట్టు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా కొత్త రసాయన బంధాల వల్ల ఏర్పడిన కొత్త మాలిక్యులర్ నెట్‌వర్క్ ప్లాస్టిక్ కి అసాధారణ యాంత్రిక బలాన్ని ఇచ్చింది. ఈ పదార్థం ఇంజెక్షన్ మోల్డింగ్, మెషినింగ్ వంటి పారిశ్రామిక విధానాల్లో ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. అదే సమయంలో 180°C వరకు వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.
బలమైనదీ, వంగిపోయేదీను..
పరీక్షల్లో ఈ బాంబూ ప్లాస్టిక్ 110 మెగాపాస్కల్స్ టెన్సైల్ బలాన్ని చూపించింది. ఇది మార్కెట్‌లో ఉన్న కొన్ని నైలాన్, పాలిప్రొపైలిన్ ప్లాస్టిక్ ల బలం కంటే ఎక్కువ. అయినా, ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఏ ఆకారంలోకి అయినా మలచవచ్చు. సులువుగా వంగిపోతుంది. అంటే ఇది బలంగా ఉండే ఫ్లెక్సిబుల్ బయోప్లాస్టిక్ అన్నమాట.
పర్యావరణహితం
ఈ ప్లాస్టిక్ కి ఉన్న నిజమైన మ్యాజిక్ దాని బయోడీగ్రడేషన్ క్వాలిటీ. సహజమైన మట్టిలో ఉంచితే ఇది కేవలం 50 రోజుల్లోపే పూర్తిగా దానిలో కలిసిపోతుంది. కాబట్టి సాధారణ ప్లాస్టిక్ లాగా హానికరం కాదు. దీన్ని రీసైకిల్ చేసినప్పుడు కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. మొదటగా దానికి ఉన్న బలంలో దాదాపు 90% వరకు నిలబెట్టుకుంటుంది. సవాళ్లు ఇప్పటివరకు ఈ బాంబూ ప్లాస్టిక్ ప్రయోగశాల స్థాయిలో మాత్రమే పరీక్షించబడింది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఖర్చు, యంత్ర సౌకర్యాలు, దీర్ఘకాల వినియోగ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచం రోజుకి కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తోంది. అలాంటి సమయంలో, బాంబూతో పుట్టిన ఈ బయోప్లాస్టిక్ పర్యావరణానికి ఒక కొత్త ఊపిరి ఇవ్వగలదు.