GPay | గూగుల్ పే లో రక్షణ లేదు

గూగుల్ పేలో ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) ఇంటిగ్రేట్ చేయకపోవడం వల్ల మోసాలు జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపుల్లో మూడింట ఒక వంతు సురక్షితం కాదని టెలికాం కార్యదర్శి నీరజ్ మిట్టల్ హెచ్చరిక.

GPay | గూగుల్ పే లో రక్షణ లేదు

హైదరాబాద్, విధాత : గూగుల్ పే ఇప్పటి వరకు ప్రభుత్వం సూచించిన ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఫ్రై) సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయకపోవడం మూలంగా మొబైల్ నెంబర్ తో జరుగుతున్న లావాదేవీల వల్ల ఆర్థిక మోసాలు జరుగుతాయని టెలికమ్యునేషన్ల విభాగం కార్యదర్శి నీరజ్ మిట్టల్ హెచ్చరించారు. మొబైల్ నెంబర్లతో జరిగిన లావాదేవీలతో ఏదైనా మోసం, నష్టం జరిగితే వెంటనే నిలిపివేయడం, కనుక్కోవడం చాలా కష్టమన్నారు. ఆర్థిక నేరాలను నియంత్రించేందుకే ఫ్రై తీసుకువచ్చామని, ఇప్పటికైనా గూగుల్ పే దీన్ని అమలు చేయాలని ఆయన కోరారు. తమ అంచనా ప్రకారం మూడింట్లో ఒక వంతు మంది ఉపయోగిస్తున్న యూపీఐ విధానం సురక్షితంగా లేదని తేల్చి చెప్పారు. ఫొన్ పే, పేటీఎం సంస్థలు ఫ్రై సిస్టమ్ ను ఇంటిగ్రేట్ చేశాయని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు గూగుల్ పే కంపెనీ ప్రతినిధులతో చర్చించామని, బహుళ జాతి కంపెనీ కావడంతో అమలు చేయడానికి చాలా సమయం తీసుకుంటాయన్నారు. రెండు నెలల వ్యవధిలో 50 బ్యాంకులు, యూపీఐ అందిస్తున్న సంస్థలు ఫ్రై ని సమర్థవంతంగా అమలు చేశాయని నీరజ్ కొనియాడారు.

ఫ్రై సిస్టమ్ ను యూపీఐ లావాదేవీలలో చేర్చడం మూలంగా ఖాతాదారులకు ఎంతో మేలు జరుగుతోందని, ఆర్థిక నష్టాల నుంచి సురక్షితంగా ఉంటున్నారన్నారు. ఫ్రై సిస్టమ్ మూలంగా గడచిన రెండు నెలల్లో ఫోన్ పే రూ.125 కోట్లు, పేటీఎం రూ.68 కోట్లు మేర నష్టం తప్పించిందన్నారు. ఆన్ లైన్ మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు డిజి కవచ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అమలు చేస్తున్నామని గూగుల్ ఇండియా కోర్ ప్రతినిధి రాజేష్ రంజన్ వెల్లడించారు. ఫ్రై ని అమలు చేసే విషయంపై టెలికమ్యునికేషన్ల అధికారులతో చర్చిస్తున్నామన్నారు. గడచిన ఆగస్టు నెలలో గూగుల్ పే రెండో అతిపెద్ద యూపీఐ లావాదేవీలు జరపగా ఆ తరువాతి స్థానంలో ఫోన్ పే ఉందని మిట్టల్ అన్నారు. డిజిటల్ పేమెంట్లలో రక్షణ కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంకులతో పాటు చిన్న బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులకు ఫ్రై విధానాన్ని అమలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. సైబర్ ఫ్రాడ్ ఘటనలు 2022 లో 1.029 మిలియన్లు నమోదు కాగా 2024 లో 2.268 మిలియన్ల కు పెరిగిందన్నారు. సైబర్ ఫ్రాడ్ తో సంబంధం ఉన్న 9,42,000 సిమ్ కార్డులు, 2,63,348ఐఎంఈఐ నెంబర్లను టెలికమ్యునికేషన్ల విభాగం బ్లాక్ చేసిందని నీరజ్ మిట్టల్ వివరించారు.