జనగామలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్…ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ

జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఆధిపత్యపోరు శుక్రవారం మంత్రి సీతక్క సమక్షంలో భగ్గుమన్నది. జనగామలో స్థానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్రెడ్డికి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేగా పల్లా, అధికార పార్టీ నేతగా కొమ్మూరి ఆధ్వర్యంలో జనగామలో నువ్వానేనా అనే రీతిలో వివాదాలు,

  • By: Tech |    news |    Published on : Jan 24, 2026 10:25 AM IST
జనగామలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్…ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ

జనగామలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
మంత్రి సీతక్క సమక్షంలో ఆధిపత్యపోరు
ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ
పోలీసుల అప్రమత్తతో సద్దుమణిగిన లొల్లి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:  జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఆధిపత్యపోరు శుక్రవారం మంత్రి సీతక్క సమక్షంలో భగ్గుమన్నది. జనగామలో స్థానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్రెడ్డికి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేగా పల్లా, అధికార పార్టీ నేతగా కొమ్మూరి ఆధ్వర్యంలో జనగామలో నువ్వానేనా అనే రీతిలో వివాదాలు, విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జనగామలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో గత కొంతకాలంగా ఉన్న విభేదాల నేపథ్యంలో తాజా ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి, ఆయన కుమారుడు ప్రశాంత్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే స్థాయిలో అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు, పల్లా అనుచరులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆహ్వానించారు. దీనిని వ్యతిరేకిస్తూ కొమ్మూరి కుమారుడు ప్రశాంత్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జై కాంగ్రెస్, జై పల్లా నినాదాలతో ఇరువర్గాలు తోచుకోవడంతో అక్కడ ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులపై పల్లా మండిపడడంతో వాతావరణం మరింత వేడెక్కింది. పరిస్థితిని గమనించిన పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి ఇరువర్గాలను వెళ్ళగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం పల్లా మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తప్పతాగి తనపైకి దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాలని ఘర్షణ సృష్టించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి.