HYDRA | హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయ‌ని తెలిపారు. అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చాం, చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదన్నారు.

  • By: TAAZ    news    May 08, 2025 7:24 PM IST
HYDRA | హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • ఆక్రమణదారులకే హైడ్రాపై కోపం
  • ప్రజల కోసమే హైడ్రా.. తగ్గేది లేదు
  • వారికి మేలు జరగొద్దని చూస్తారా?
  • చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తుంటే..
  • రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందంటారు
  • కడుపు నిండా విషం పెట్టుకున్న విపక్షం
  • అక్రమ నిర్మాణాలను నియంత్రించొద్దా?
  • పేదల పట్ల మానవీయంగా ఉండాలి
  • హైడ్రా పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు

HYDRA |

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారు. అసలు మీ బాధ ఎంది?. వాళ్ళు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు.. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. సికింద్రాబాద్ లో గురువారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, మ‌హానగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయన్నారు.

కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదా అని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేద్దామా? అందుకే హైడ్రాను ఏర్పాటు చేసుకున్నామ‌ని వివ‌రించారు. హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తున్నామ‌ని, చెరువులను, నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపమ‌ని, అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించినా… ప్రజలకోసం మేం వెనక్కి తగ్గేది లేదని స్ప‌ష్టం చేశారు.

హైడ్రా అధికారులకు సూచన..

హైడ్రా అధికారులకు నా సూచన.. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించండి. పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి. పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధ అవుతుంది, ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తుంద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందని, 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని వివ‌రించారు. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిజైన్ ప్ర‌కారం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిర్మించారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చామ‌ని చెప్పారు.

బెంగళూరు దుస్థితిని చూడండి..

బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి మీకు తెలిసిందేన‌న్నారు. ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతుండ‌గా, కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్న దుస్థితి దాపురించిందన్నారు. మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయని, ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయ‌ని తెలిపారు. అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చాం, చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించర‌న్నారు.

హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయి, అందుకే అప్ర‌మ‌త్త‌మ‌య్యామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు… రోడ్డుపై నీరు నిలవకుండా, విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతను హైడ్రా చూసుకుంటోంద‌ని అభినందించారు. గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారు, కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారన్నారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా అని ప్ర‌శ్నించారు. నాపై కక్ష ఉంటే నాపై చూపండి.. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దని ముఖ్య‌మంత్రి కోరారు.

కొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బుద్ధ భవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రా పోలీస్ స్టేషన్‌తో పాటు హైడ్రాకు సమకూర్చిన 80కి పైగా కొత్త వాహనాలు, యంత్రాలను సైతం ప్రారంభించారు. 55 స్కార్పియోలు, 21 డీఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కారులు, ట్రూప్ క్యారియర్ వ్యానులు, కొన్ని బైకులకు రేవంత్ రెడ్డి జెంగా ఊపి ప్రారంభించారు.