Congress: రాజీనామా బాటలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి?

విధాత: కాంగ్రెస్ అధిష్టానం..సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు మంత్రివర్గ విస్తరణ కసరత్తుకు తుది రూపు తీసుకొచ్చే పనిలో ఉండగా..ఇంకోవైపు ఆశావహుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 43శాతం జనాభా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ల జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ పెద్ధలను కలిసి విన్నవించారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ లను కలిసి తమ వినతి పత్రాలు అందించారు. సీనియర్ నాయకులు కే.జానారెడ్డి సైతం ఈ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ కు లేఖ రాశారు.
అయితే తాజాగా మల్ రెడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఒకవేళ మంత్రి ఇవ్వ కపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తన స్థానంలో మరో సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టి గెలిపిస్తానని అన్నారు. అప్పుడైనా వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. మల్ రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హల్చల్ మారాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు ఆయన మాటలను మన్నిస్తుందన్నది త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తేలనుంది.