12 వర్సిటీల్లో 1270మంది లెక్చరర్లు.. కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేయాలి

విధాత, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1270మంది కాంట్రాక్టు లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా పర్మినెంట్ చేయాలని, ఏప్రిల్ 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 వెంటనే రద్దుచేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం పిలుపుమేరకు మంగళవారం అధ్యాపకులు తరగతులను బహిష్కరించి కాకతీయ విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన భవనం ముందు ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ కర్ణాకర్ రావు, డాక్టర్ శ్రీధర్ కుమార్ లోతు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని గతంలో అనేక సార్లు గత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినమని, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అందరిని రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 4వ తారీఖున రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 21 ఒప్పంద అధ్యాపకులకు ఎలాంటి లాభం చేకూర్చే విధంగా లేదని వెంటనే జీవోను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తామన్నారు వీరందరికీ ఉద్యోగ భద్రతతో పాటు తక్షణమే ఉద్యోగ భద్రతతో పాటు యూజీసీ సెవెంత్ పే బేసిక్ ప్లస్ డి ఏ ప్లేస్ హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే దిశగా తగు చర్యలు చేపట్టాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు అన్నారు. అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఆందోళన కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఒప్పంద అధ్యాపకులు డాక్టర్ సాధు రాజేష్ డాక్టర్ సతీష్ డాక్టర్ వీణ డాక్టర్ ఆశీర్వాదం డాక్టర్ అంజన్న రావు డాక్టర్ గడ్డం కృష్ణ ఆర్ డి ప్రసాద్ డాక్టర్ కే మధుకర్ రావు డాక్టర్ బిక్షపతి డాక్టర్ లక్ష్మారెడ్డి డాక్టర్ సునీత సుజాత డాక్టర్ సంగీత్ కుమార్ డాక్టర్ బ్లెస్సీ ప్రియాంక శ్రీలత సుచరిత పాల్ సత్యజూల డాక్టర్ సదాశివ డాక్టర్ నాగేశ్వరరావు తూర్పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.