అప్పగింతల్లో పెళ్లికూతురిని వదలని పెంపుడు కుక్కలు.. ఇంటర్‌నెట్‌ ఫిదా

పెళ్లి తర్వాత అప్పగింతలు పెళ్లికూతురి తల్లిదండ్రులు, బంధువులు, ఆత్మీయులను కన్నీళ్లలో ముంచేస్తాయి. అదో స్పెషల్‌ అకేషన్‌. కానీ.. డెహ్రాడూన్‌లో తల్లిదండ్రులు, బంధువుల కంటే మించిన ప్రేమను చాటుకున్నాయి ఆమె పెంచిన కుక్కలు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఆ అమాయక మూగజీవాలపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోంది.

  • By: TAAZ |    news |    Published on : Apr 03, 2026 6:45 PM IST
అప్పగింతల్లో పెళ్లికూతురిని వదలని పెంపుడు కుక్కలు.. ఇంటర్‌నెట్‌ ఫిదా

డెహ్రూడూన్‌కు చెందిన గౌరీ సింగ్‌.. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఇకపై ఆమెకు ఇదొక కొత్త అధ్యాయం. ఉన్న ఊరిని, కన్నవాళ్లను వదిలిపెట్టి వెళ్లే సమయంలో అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో ఆమె పెంచిన మూడు పెంపుడు కుక్కలు సైతం ఆమెను వదల్లేక పోయాయి. ఆమెను వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించాయి. ఆ శునకాల ప్రేమ చూసిన గౌరీసింగ్‌ కన్నీటిపర్యంతమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నది.

తన భర్తతో కలిసి వెళ్లిపోయేందుకు గౌరీ సింగ్‌ సిద్ధమవుతున్న సమయంలో ఆమె మూడు పెంపుడు కుక్కలు.. స్నోయీ (లాబ్రడార్‌), మిష్కు (గోల్డెన్‌ రిట్రైవర్‌), లైలా (జర్మన్‌ షెపర్డ్‌) ఆ దృశ్యాన్ని ఇంటి బాల్కనీ నుంచి గమనించాయి. ఏం అర్థమైందో ఏమో.. కానీ.. అక్కడి నుంచే మొరగడం ప్రారంభించాయి. అది చూసిన గౌరీసింగ్‌ కన్నీరుమున్నీరైంది. ఇక ఆగలేక.. బాల్కనీకి వెళ్లి తాను ప్రాణంగా పెంచుకున్న మూడు పెంపుడు కుక్కలను దగ్గరకు తీసుకుంది.  ప్రేమగా వాటిని నిమురుతూ.. వాటితో ‘మమ్మా యహీ హై’ (అమ్మ ఇక్కడే ఉందిగా..) అంటూ నేనిక్కడే ఉన్నాను.. అంటూ భరోసా ఇచ్చింది. అంతచెప్పినా ఆ కుక్కలు ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. ఆమెపైకి ఎగబాకుతూ ఆమెను పట్టుకుని తమ గాఢమైన ప్రేమను ప్రకటించాయి. ఆ దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. చూసిన వారి కళ్లలో సైతం నీళ్లు తెప్పించాయి. గౌరీసింగ్‌కు, ఆమె పెంచిన కుక్కలకు మధ్య ఉన్న అనుబంధాన్ని, వాటికి ఆమె పట్ల ఉన్న విశ్వాసాన్ని మెచ్చుకుంటూ అనేక మంది కామెంట్లు పెట్టారు.

ఇన్‌స్టా యూజర్లు ఈ అద్భుతమైన వీడియోకు వెంటనే స్పందించారు. కుక్కల విశ్వాసం తమను ఎలా హత్తుకుందో కామెంట్లలో వివరించారు. గౌరీసింగ్‌ తన వెంట తన ‘పిల్లలను’ తీసుకెళ్లాలని కొందరు సూచించారు. ‘నిజమైన పెట్‌ పేరెంట్స్‌ మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు’ అని ఒకరు రాశారు. అది చూసి నిజంగా నాకు ఏడుపొచ్చేసింది.. అంటూ మరొకరు స్పందించారు. ‘ఇదే నాకున్న అదిపెద్ద భయం’ అని మరో యూజర్‌ పేర్కొన్నారు. ‘మనుషులకంటే జంతువులకే విశ్వాసం ఎక్కువగా ఉంటుంది’ అని మరొక యూజర్‌ కామెంట్‌ పెట్టారు.

2026 ఏప్రిల్‌ 1న షేర్‌ చేసిన ఈ వీడియో.. అప్పటి నుంచి 43.9 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 2.7 మిలియన్లకుపైగా లైక్స్‌ వచ్చాయి.

పెంపుడు జంతువులు ఎంత ప్రేమతో, విశ్వాసంతో ఉంటాయో ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. స్నోయి, మిష్కు, లైలా.. గౌరీసింగ్‌ దగ్గర ఉన్నప్పుడు వాటి కళ్లలో కనిపించిన దానిని మాటల్లో వర్ణించలేనిది. ఆమెను అవి వెళ్లనీయలేదంటే ఆమెతో ఎంతటి అనుబంధాన్ని పెంచుకున్నాయో అర్థమవుతున్నది. పెట్స్‌ కేవలం జంతువులు కావని, అవి మన సహచరులని, వాటి ప్రేమను, హృదయాన్ని బేషరతుగా మనకు ఇచ్చేస్తాయని కొందరు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు.

 

View this post on Instagram

 

A post shared by Tri Paw Squad (@tripawsquad)

ఇవి కూడా చదవండి..

వెదర్ అప్డేట్…తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
బయటపడ్డ ఆప్‌ అంతర్గత పోరు.. రాఘవ్‌ ఛద్దాను అందుకే దూరం పెట్టారా?
Maoists | ఇక‌నైనా ‘అడ‌వి’ని వీడు బిడ్డా..! మావోయిస్టుకు ఓ తండ్రి భావోద్వేగ సందేశం