IRCTC Best Package: రూ. 5080కే గోదావరి అందాలు, పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు
రూ.5080కే ఐఆర్‌సీటీసీ (IRCTC) గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి పుణ్యక్షేత్రాల యాత్ర.
గోదావరి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పచ్చని పైర్లు, కొబ్బరి చెట్లు అందమైన నదీ తీరాలు, ఇసుక తిన్నెలు, పుణ్యక్షేత్రాలు.. వింటుంటేనే ఎంతో వైబ్రంట్‌గా ఉంది కదా.. వెంటనే బ్యాగ్ సర్దుకుని అక్కడికి చెక్కేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలా వెళ్లేందుకు IRCTC తక్కకు ధరకే వీటన్నింటినీ చూపించేందుకు బెస్ట్ ప్యాకేజీని అందిస్తుంది. గోదావరి టెంపుల్ టూర్ పేరుతో రూ.5080కే అందిస్తుంది. ఈ ప్యాకేజీలో పూర్తిగా మూడు రాత్రులు నాలుగు రోజులు ఉంటుంది. ఈ నెల14న ట్రిప్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌నుంచి రాత్రి 8.30 గంటలకు, సికింద్రాబాద్‌లో అయితే రాత్రి 9.15 గంటలకు గౌతమి ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. ప్రతి శుక్రవారం ఈ ప్లాన్ ఉంటుంది.
మొదటి రోజు అంటే శుక్రవారం రాత్రి బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసి మరుసటి రోజు తెల్లవారు జామున రాజమండ్రి స్టేషన్‌లో 4.38 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి హోటల్‌కు చేరుకుంటాము. అక్కడ కాసేపు సేదతీరాక 80 కి.మీ దూరంలో ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కారులో తీసుకు వెళతారు. అనంతరం స్వామివారి దర్శనమయ్యాక తిరిగి సాయంకాలానికి రాజమండ్రిలోని హోటల్‌కు చేరుకుంటాము. వెంటనే గోదావరి అందాలను చూపించేందుకు గోదావరి ఘాట్, అలాగే ఇస్కాన్ టెంపుల్ ను దర్శించుకుని రాత్రి రాజమండ్రిలోనే బస చేస్తాము. మూడవ రోజు హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యి అంతర్వేది సముద్ర తీరానికి వెళతాము, అక్కడే ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాక, అంతర్వేది బీచ్‌ను ఆస్వాదిస్తాము. ఆ తర్వాత శ్రీ బాల బాలాజీ టెంపుల్, అప్పనపల్లి, విగ్నేశ్వర టెంపుల్, ఐనవల్లి చూసిన తర్వాత సాయంత్రం ద్రాక్షారామం శివయ్యను దర్శించుకుంటాము. స్వామి వారి ఆశిస్సులు తీసుకున్నాక రాత్రి 8.18 గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాము, అక్కడ తిరిగి గౌతమి ఎక్స్ ప్రెస్ నెంబర్ 12737 రైలు ఎక్కి రాత్రంతా జర్నీ చేసి నాలుగవ రోజు తెల్లవారు జామున సికింద్రాబాద్‌కు 4.35 గంటలకు, లింగంపల్లి అయితే 5.55 గంటలకు చేరుకుంటాము.
టికెట్ల ధరల విషయానికి వస్తే ఒక్కరే వెళ్తే ఈ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ టికెట్ అయితే 13800 అదే 3ఏసీ టికెట్ ధర అయితే రూ. 15340 అవుతుంది. అదే ఇద్దరు కలిసి వెళ్తే 3ఏసీ ధర రూ. 8940, స్లీపర్ క్లాస్ ధర రూ.7400. నలుగురు లేదా ఆరుగురు కలిసి వెళ్తే మాత్రం 3ఏసీ టికెట్ ధర రూ.6630, స్లీపర్ ధర రూ.5080 పడుతుంది. అదే మీ వెంట 5 సంవత్సరాల నుంచి 11 ఏళ్ల పిల్లలు ఉన్నట్లైతే 3ఏసీ టికెట్ ధర అయితే 6080, స్టాండర్డ్ అయితే 4540 ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram