Dil Raju: పవన్ సినిమాలు ఆపే దమ్ము ఎవరికీ లేదు: ప్రముఖ నిర్మాత దిల్ రాజు

– నాకు ఎక్కువ థియేటర్లు ఉన్నాయన్నది తప్పుడు ప్రచారం
– నైజాంలో నాకు ఉన్నది కేవలం 30 థియేటర్లు మాత్రమే..
– ఆ నలుగురి దగ్గరే టాకీస్ లు ఉన్నాయంటూ దుష్ప్రచారం
– థియేటర్లు బంద్ పెడుతున్నామని అసత్య వార్తలు
– పర్సంటేజ్ ల విషయంలో ఎగ్జిబిటర్లకు సమస్యలున్నది నిజమే
– అందరం కలిసి ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటాం
– ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఏపీ ప్రభుత్వంతో వివాదంపై క్లారిటీ
Dil Raju: విధాత, హైదరాబాద్: ఇటీవల ఏపీ ప్రభుత్వం, టాలీవడ్ ఇండస్ట్రీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తున్నా వాళ్లకు కనీసం కృతజ్ఞత లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల కాబోతున్న నేపథ్యంలో థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు రావడంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ నటించిన సినిమాలను ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ పేర్కొన్నారు. తనకు ఎక్కువ థియేటర్లు ఉన్నాయని .. ఆ నలుగురి చేతిలోనే థియేటర్లు మొత్తం ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి తనకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నది తప్పుడు ప్రచారమేనని పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారు
మీడియా అసలు నిజాలను నిర్ధారణ చేసుకోకుండానే వార్తలు ప్రసారం చేసిందంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లతో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని .. వాటిని తాము చర్చలతో పరిష్కరించుకుంటామని క్లారిటీ ఇచ్చారు. పర్సెంటేజీల విషయంలో ఎగ్జిబిటర్లు సమస్యలను ఎదుర్కొంటున్నది నిజమేనని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తమకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానం అమలవుతున్నదని చెప్పారు. మొదటి వారంలో రెవెన్యూ బాగా వస్తే రెంట్ ఇస్తున్నామని.. కలెక్షన్లు తగ్గాక పర్సెంటేజ్ ఇస్తున్నామని.. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారన్నారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
పర్సంటేజ్ ఇవ్వాలన్న డిమాండ్ వారి నుంచి వస్తున్నదని దీనిపై చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ఏప్రిల్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
నాకున్నది 30 థియేటర్లే..
నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు తమ సమస్యలను పరిష్కరించకపోతే థియేటర్లను ఆపేస్తామన్నారని.. అయితే తాను వారించానని చెప్పారు. కానీ మీడియా మాత్రం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు వార్తలు రాయడం వల్లే సమస్యలు వచ్చాయని చెప్పారు. కొంతమంది మధ్య వచ్చిన సమస్యల వల్ల మొత్తం ఇండస్ట్రీకే చెడ్డపేరు వచ్చిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు