Aadhaar-Voter Card Seeding: ఓటర్ కార్డు.. ఆధార్ అనుసంధానం! ఈసీ గ్రీన్ సిగ్నల్

విధాత: ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటరు కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్ భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్, ఈసీలు డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, యూఐడీఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఓటర్ కార్డులను ఆధార్ అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈసీ నిర్ణయంతో త్వరలో యూఐడీఏఐ, ఈసీఐ నిపుణుల మధ్య సాంకేతిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదు చేసుకొనే అవకాశం కల్పించడంతో పాటు నకిలీ ఐడి కార్డులను తొలగించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారానే పౌరుడి గుర్తింపు నిర్ధారణ. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనల ప్రకారం, సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా మాత్రమే ఓటర్ కార్డును ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని నిర్ణయించబడిందని కేంద్రం ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. నకిలీ ఓటర్ల ద్వారా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయన్న విమర్శలు సైతం రాజకీయ పార్టీలు చేశాయి. కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారన్న విమర్శలు సైతం సాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలతో పాటు రిగ్గింగ్ వంటి సమస్యలను నివారించేందుకు ఎన్నికల సంఘం ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానించిన వారినే ఓటింగ్ కు అనుమతిస్తారు. ఇదీ బోగస్ ఓట్ల నివారణకు ఉపయోగపడనుంది. ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.