Union Cabinet | ఢిల్లీ పేలుడు.. ఉగ్రదాడి‌గా ప్రకటించిన కేంద్రం

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర క్యాబినెట్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఢిల్లీ పేలుడుపై తీవ్ర స్థాయిలో చర్చించారు.

  • By: chinna |    news |    Published on : Nov 12, 2025 10:02 PM IST
Union Cabinet | ఢిల్లీ పేలుడు.. ఉగ్రదాడి‌గా ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ :

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర క్యాబినెట్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఢిల్లీ పేలుడుపై తీవ్ర స్థాయిలో చర్చించారు. చర్చకు ముందు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. మోదీ భూటాన్ పర్యటనను ముగించుకుని వచ్చిన తరువాత ప్రధాని నివాసంలో జరిగిన క్యాబినెట్ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, తదితరులు హాజరయ్యారు.

పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన కేంద్ర క్యాబినెట్.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. బాధితులు వారి కుటుంబాలకు న్యాయం కల్పించే విధంగా తక్షణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బాధ్యులను త్వరలోనే చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరు కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

అలాగే, ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్ పోర్టు ప్రమోషన్ మిషన్ కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎగుమతులకు కేంద్రం రూ.25,060 కోట్ల ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఎగుమతి దారుల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని తీసుకురాబోతున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఖనిజాల అన్వేషణ చట్ట సవరణకు మంత్రివర్గం ఓకే తెలిపిందని వెల్లడించారు.