El Ejido | ‘ఎల్ డొరాడో’.. ది లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్.. మరి ‘ఎల్ ఎజిడో’ ఏంటో తెలుసా? ఆకాశం నుంచి కనిపించే ఏకైక మానవ కట్టడం!
వాస్తవానికి ఒకప్పుడు ఇదంతా బీడుపడిపోయిన ఉప్పు నేల. పంటలు పండించడానికి ఏ మాత్రం అనువైన భూములు కావవి. కానీ.. కొందరు రైతులు ప్లాస్టిక్ షీట్లతో ప్రయోగం చేయడం మొదలు పెట్టారు. భూమి కోతకు గురికాకుండా, తేమను లోపలే భద్రపరిచేలా తాత్కాలిక గుడారాల వంటివి ఏర్పాటు చేశారు. కానీ..

El Ejido | చాలా ఏళ్లుగా అంతరిక్షం నుంచి కనిపించే మానవ కట్టడం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనుకున్నారు. కొందరైతే ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ అన్నారు. ఇదెలా ఉంటుందంటే.. మీరు మీ వైఫై సిగ్నల్‌ను చూడగలరా? చూడలేరు కదా! ఇదీ అంతే. వాస్తవానికి ఈ రెండు కట్టడాలు ఎంత గొప్పవైనా.. ఎంత భారీ సైజులో ఉన్నా.. వాటిని వాతావరణంలో రెండో పొర అయిన స్ట్రాటోస్ఫియర్ నుంచి మానవ కంటితో చూడటం సాధ్యం కాదు. ఉపగ్రహాల నుంచి తీసినట్టు చెప్పే మనం చూసే వాటి ఫొటోలు కూడా జూమ్ చేసినవే. మరి ఇంకే నిర్మాణం కూడా స్ట్రాటోస్ఫియర్ నుంచి చూడలేమా? చూడగలం.
ఎక్కడుందా ప్రాంతం!
అంతరిక్షంలో ఏడు నుంచి 37 మైళ్ల పైన ఉండే స్ట్రాటోస్ఫియర్ నుంచి చూస్తే కనిపించే మానవ నిర్మాణ సమూహం ఒకటి ఉంది. అది కూడా పురాతనమైనదేమీ కాదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. మీరు నమ్మండి.. నమ్మక పోండి.. అదంతా ప్లాస్టిక్ కవర్‌లతో కప్పేసి ఉంటుంది. అదే స్పెయిన్‌లోని ఎల్ ఎజిడో! కేజీఎఫ్ సినిమాలో ప్రస్తావనకు వచ్చిన ఎల్ డొరాడో.. బంగారానికి ఎలా ప్రసిద్ధి చెందిందో.. ఎల్ ఎజిడో అలా బంగారం లాంటి పంటలను పండించే ప్రదేశం. నిజమే.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యవసాయ క్షేత్రం. దీనిని ముద్దుగా ప్లాస్టిక్ సముద్రం అని పిలుస్తారు. అద్దంలా మెరిసే ఇక్కడి విస్తారమైన వ్యవసాయ క్షేత్రాన్ని ఫొటోలు తీస్తే.. అద్దాల్లా కనిపించాయి. ఇక్కడ ఏకంగా 40వేల హెక్టార్లలో గ్రీన్‌హౌస్‌లు ఉన్నాయి. అంటే.. ఒక చిన్న దేశం కంటే విస్తారమైనదన్నమాట. వాటిలో ఎక్కువగా టమాటాలు, మిరియాలు, దోసకాయలు, పుచ్చకాయలు పండిస్తున్నారు. ప్రత్యేకించి శీతాకాలాల్లో ఐరోపా మార్కెట్‌లన్నింటికీ వ్యవసాయోత్పత్తులు ఇక్కడి నుంచే వెళుతుంటాయి.
ఒకప్పుడు బీడు భూమి.. ఇప్పుడు బంగారాల పంట
వాస్తవానికి ఒకప్పుడు ఇదంతా బీడుపడిపోయిన ఉప్పు నేల. పంటలు పండించడానికి ఏ మాత్రం అనువైన భూములు కావవి. కానీ.. కొందరు రైతులు ప్లాస్టిక్ షీట్లతో ప్రయోగం చేయడం మొదలు పెట్టారు. భూమి కోతకు గురికాకుండా, తేమను లోపలే భద్రపరిచేలా తాత్కాలిక గుడారాల వంటివి ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ గుడారాల లోపలి వేడి, తేమ తమ పంటలను కాపాడుతున్న విషయాన్ని గుర్తించారు. ఇక అక్కడి నుంచి వాళ్లు వెనక్కు తిరిగి చూసుకోలేదు. దశాబ్దాలు గడిచేసరికి అప్పటి చిన్న చిన్న గుడారాలు.. భారీ గ్రీన్‌హౌస్ నిర్మాణాలుగా విస్తరించాయి. వాటితోపాటు డ్రిప్ ఇరిగేషన్, హైడ్రోపోనిక్స్ (నీళ్లలో పెరిగే మొక్కలు), కృత్రిమ భూమి వంటి పద్ధతులు తోవడవడంతో ఎల్ ఎజిడో.. మరో ఎల్ డొరాడోలా తయారైంది. లక్షల టన్నుల తాజా పంట ఉత్పత్తులను ప్రతియేటా అందిస్తున్నది.
ధృవీకరించిన నాసా
ఈ ప్రదేశం ఆకాశం నుంచి కనిపిస్తుందని నాసా సైతం ధృవీకరించడం విశేషం. ఎల్ ఎజిడో లో మెరుస్తున్న ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను నాసా ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసింది. ఆ చిత్రాల్లో కనిపించే ప్లాస్టిక్ రూఫ్‌లు.. గ్రీన్‌హౌస్‌లపైన కప్పి ఉంచినవి. ఆ ప్లాస్టిక్ షీట్లపై పడే సూర్యకాంతి ప్రతిఫలించడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాలకంటే కాంతిమంతంగా ఈ ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ వాడటం వెనుక ఒక ప్రయోజనం కూడా ఉన్నది. ఈ ప్రాంతంలో చల్లదనానికి ఇవి దోహదం చేస్తున్నాయని నాసాకు చెందిన మూడీస్ పరికరాలు పేర్కొంటున్నాయి. ఒక విధంగా ఇక్కడ అద్భుతం జరిగిందనుకున్నా.. ఇక్కడ వెలువడే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ ఒక ఆందోళనకర అంశంగా ఉన్నది. విపరీతంగా నీటి వినియోగం, అక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం వంటివాటిపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆహారోత్పత్తి, వాతావరణం చల్లబడటం సానుకూల అంశాలైనా.. వ్యవసాయంలో మితిమీరిన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.