చిక్కుల్లో నయన్ ‘అన్నపూరణి’ చిత్రం.. మహారాష్ట్రలో ఎఫ్‌ఐఆర్ నమోదు..!
నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’ వివాదాల్లో చిక్కుకున్నది. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదంటూ శివసేన మాజీ నేత రమేశ్ సొలంకి పోలీసులకు ఫిర్యాదు

Annapoorani | సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’ వివాదాల్లో చిక్కుకున్నది. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదంటూ శివసేన మాజీ నేత రమేశ్ సొలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాతలు శ్రీరామచంద్రుడిని అవమానించారని ఆరోపించారు. ఈ చిత్రం ‘హిందూ వ్యతిరేకం’ అని రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదైంది. సమస్యాత్మకంగా భావించే విషయాలను చిత్రంలో ఎత్తి చూపారని.. లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు.
చిత్రం నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’పై చర్యలు తీసుకోవాలని ముంబయి పోలీసులతో పాటు, మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆయన విజ్ఞ ప్తిచేశారు. ‘భగవాన్ శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మించిన వ్యతిరేక చిత్రం అన్నపూరణి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. హిందూ పూజారి కుమార్తె బిర్యానీ వండే సమయంలో నమాజ్ చేస్తుంది. ఈ చిత్రంలో లవ్ జిహాద్ ప్రచారంను ప్రోత్సహించే ప్రచారం చేశారు. రాముడు మాంసాహారేనని ఫర్హాన్ (నటుడు) మాంసం తినమని నటిని ఒప్పించాడు’ అంటూ సొలంకి పేర్కొన్నారు.
‘ఈ చిత్రంలో నటి తండ్రి ఆలయ పూజారి అని, అతను విష్ణువుకు కూడా నైవేద్యాలు పెడతాడు, అయితే ఈ చిత్రంలో అతని కుమార్తె మాంసం వండడం, ముస్లింతో ప్రేమలో పడడం, రంజాన్ ఇఫ్తార్‌కు వెళ్లడం, నమాజ్ చేయడం వంటివాటిని సైతం చూపించారు’ అని సోలంకి తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా, జీ స్టూడియోస్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రాన్ని రూపొందించి విడుదల చేశాయని ఆరోపించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను ముంబయి పోలీసులను, ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
‘అన్నపూరణి’ దర్శకుడు నీలేష్ కృష్ణ, నటి నయనతార, నిర్మాతలు జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్, పునీత్ గోయెంకా, జీ స్టూడియో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షరీక్ పటేల్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే, ఇప్పటి వరకు మేకర్స్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం స్పందించలేదు. రమేశ్ సోలంకి హిందీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు. అన్నపూరణి తమిళ చిత్రం. ఇది గతేడాది డిసెంబర్ ఒకటిన విడుదలైంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇందులో నయనతార, చై, సత్యరాజ్ నటించారు. చెఫ్ కావాలని కలలు కనే అన్నపూరణి చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఆమెకు ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించింది అనేది ‘అన్నపూరణి’ స్టోరీ.