GHMC Deputation Corruption | జీహెచ్ఎంసీలో తిష్ఠ వేసిన ‘డిప్యూటేషన్’
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ తో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి పలువురు అధికారులు డిప్యుటేషన్ పై జీహెచ్ఎంసీ కి వచ్చి తిష్టవేశారు. చాలా మంది రెండు దశాబ్దాలకు మించి ఇక్కడే పనిచేస్తున్నారంటే ఎంత దరిద్రంగా అడ్మినిస్ట్రేషన్ ఉందో ఊహించుకోవచ్చు. కొందరైతే ఆరు నెలల పాటు తమ మాతృశాఖకు వెళ్లి తిరిగి మంత్రుల వద్ద పైరవీలు చేసుకుని జీహెచ్ఎంసీకి వస్తున్నారు.

GHMC Deputation Corruption| హైదరాబాద్, విధాత : ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. పట్టణాభివృద్ధిపై అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ పీకే మహంతి ని ఎంసీహెచ్ (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) కమిషనర్ గా నియమించారు. కమిషనర్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు ఆయన ఆదేశాలను అమలుపరిచేందుకు సీనియర్ ఐఏఎస్ లను అర డజన్ మంది వరకు నియమించారు. పాతిక సంవత్సరాల క్రితమే కమిషనర్ తో సహా ఏడుగురు ఐఏఎస్‌లు పనిచేశారంటే, ప్రస్తుత జీహెచ్ఎంసీలో కనీసం డజన్ మంది సీనియర్ ఐఏఎస్ లు పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ స్థాయి పెరిగిన తరువాత సీనియర్లను నియమించాల్సి ఉండగా తాము ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే డూ డూ బసవన్నల మాదిరి ఐఏఎస్ లను జీహెచ్ఎంసీకి అధిపతులు నియమిస్తున్నారు. పట్టణాభివృద్ధి పై ఏమాత్రం అవగాహన లేని వారే కమిషనర్లుగా నియమితులవుతున్నారు. వీరి రాక మూలంగా నగరం మరింత అధ్వానంగా తయారవుతూ, ప్రజల జీవన ప్రమాణాలు దిగజార్చేలా చర్యలుంటున్నాయి.
పరిధి పెరిగింది.. కమిషనర్ స్థాయి పెరగలేదు
ఎంసీహెచ్‌గా ఉన్న సమయంలో పీకే మహంతి ముఖ్య కార్యదర్శి గా పనిచేశారు. ఆయనకు పట్టణాభివృద్ధి, వనరుల సమీకరణ, పౌరులకు మెరుగైన పాలన అందించడంలో జాతీయ స్థాయిలోనే విశేషమైన అనుభవంతో పాటు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన కింద ప్రధాన కార్యాలయంలో ప్లానింగ్, శానిటేషన్, ప్రాజెక్టులు, ఫైనాన్స్, యూసీడీ విభాగాలకు అడిషనల్ కమిషనర్లుగా సీనియర్ ఐఏఎస్ లు ఉన్నారు. వీరితో పాటు సికింద్రాబాద్ జోన్ అడిషనల్ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులే పనిచేశారు. కమిషనర్ నాయకత్వంలో అందరూ ఒక టీమ్ లా ఏర్పడి నగరం రూపు రేఖలు మార్చారు. ఆ సమయంలో తెల్లారే సరికల్లా నగర రోడ్లు, వీధుల వెంట చెత్త కుప్పలు కనిపించేవి కావు. ట్రాఫిక్ రద్ధీకి అనుగుణంగా రోడ్లను భారీగా విస్తరించారు. చిన్నపాటి కుంటలు కబ్జా కాకుండా నిరోధించేందుకు పార్కులుగా మార్చి, ఆ ప్రాంతంలో భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టారు. నగరంలో సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కి ఎంసీహెచ్ కమిషనర్ కన్వీనర్ కాగా మెట్రో వాటర్ సప్లయి బోర్డు ఎండీ, హుడా వైస్ ఛైర్మన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్, ట్రాఫిక్ డీసీపీ, విద్యుత్ మెట్రో జోన్ సీఈ, బీఎస్ఎన్ఎల్ పీజీఎం లు సభ్యులుగా ఉండేవారు. ప్రతి సోమవారం ఈ కమిటీ నగరంలో ఒక ప్రాంతంలో పర్యటించి, సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించేది. ఈ కమిటీ పర్యటన మూలంగా నగరంలో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఎంసీహెచ్ కి.. జీహెచ్ఎంసీ గా స్థాయి పెరిగినా కమిషనర్ స్థాయి మరింత దిగజారింది. కమిషనర్ హోదా ముఖ్య కార్యదర్శి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ స్థాయికి పెరిగింది. కార్యదర్శి స్థాయి అధికారులను, అది కూడా తమ మాట జవదాటని వాళ్లను కమిషనర్ గా నియమించుకోవడం ముఖ్యమంత్రులకు సంప్రదాయంగా మారింది.
సీనియర్లను నియమిస్తేనే పాలన గాడిలోకి
తెలంగాణ ఏర్పడిన తరువాత సోమేశ్ కుమార్ కమిషనర్ గా కొనసాగారు. ఆయన బదిలీ తరువాత బి.జనార్దన్ రెడ్డి, దాన కిశోర్, డీఎస్.లోకేశ్ కుమార్, రోనాల్డ్ రోస్, కాట అమ్రపాలి, ఇలంబర్తి, ప్రస్తుతం ఆర్వీ కర్ణన్ ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా పట్టణాభివృద్ధి, వనరుల సమీకరణ పై కనీస అవగాహన లేదు. ఏ ప్రాతిపదికన నియమించారంటే… చెప్పినట్లు తలూపుతారని, తమ మాట జవదాటి వెళ్లరని గుర్తించి నియామకం చేసుకున్నారు. ఎంసీహెచ్ గా ఉన్నప్పుడు ముఖ్య కార్యదర్శి హోదా అధికారి కమిషనర్ గా ఉంటే ఆ తరువాత వచ్చినవారు కార్యదర్శి, అంతకన్నా జూనియర్ అధికారులే కావడం శోచనీయం. ప్రస్తుత కమిషనర్ ఆర్వీ కర్ణన్ 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తలూపేవాళ్లను, ఆదేశాలను అమలు చేసే వారిని నియమించి కమిషనర్ హోదాను థర్డ్ గ్రేడ్ మునిసిపాలిటీ కమిషనర్ స్థాయికి దిగజార్చారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ ను నియమించి, అడిషనల్ కమిషనర్లుగా మరో అరడజన్ మంది సీనియర్ ఐఏఎస్ లను నియమించాల్సి ఉంటుంది. అప్పుడు కానీ పాలన గాడిలో పడుతుంది. ఈ ఉద్దేశంతోనే ఎంసీహెచ్ ను కాస్తా జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేశారు.
తిష్టవేసిన డిప్యుటేషన్ అధికారులు
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ తో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి పలువురు అధికారులు డిప్యుటేషన్ పై జీహెచ్ఎంసీ కి వచ్చి తిష్టవేశారు. చాలా మంది రెండు దశాబ్దాలకు మించి ఇక్కడే పనిచేస్తున్నారంటే ఎంత దరిద్రంగా అడ్మినిస్ట్రేషన్ ఉందో ఊహించుకోవచ్చు. కొందరైతే ఆరు నెలల పాటు తమ మాతృశాఖకు వెళ్లి తిరిగి మంత్రుల వద్ద పైరవీలు చేసుకుని జీహెచ్ఎంసీకి వస్తున్నారు. కొందరైతే వంద కోట్ల రూపాయల వరకు మూటగట్టుకున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నిత్యం ఆదాయంపైనే యావ తప్ప నగర పౌరుల సమస్యలను పరిష్కరించాలనే తపన ఏ ఒక్క అధికారిలో ఉండదంటున్నారు. సంచిలో డబ్బుల కట్టలు లేకుండా ఏ ఒక్క అధికారి సాయంత్రం ఇంటికి వెళ్లరనే ఆరోపణలున్నాయి. బదిలీలు లేకపోవడం, కఠిన శిక్షలు అమలు చేయకపోవడం వీరికి వరంగా పరిణమించింది. కమిషనర్లు వస్తారు వెళ్తారు, తాము శాశ్వతం అనే విధంగా విర్రవీగుతుంటారనే విమర్శలూ లేకపోలేదు. అవినీతికి పాల్పడుతున్నట్లు నివేదికలు ఉన్నా శాఖాపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయరు. కింది నుంచి పై స్థాయి వరకు క్రమశిక్షణ లోపించడం, జవాబుదారీతనం లేకపోవడం, రాజకీయ జోక్యం కారణంగా జీహెచ్ఎంసీ ప్రతిష్ఠ దిగజారుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Hyderabad Flooded Roads GHMC Negligence | వరదలా ‘ఉదాశీనత’! సొంత రాష్ట్రంలోనూ తీరని వెతలు!
Hyderabad Rain Traffic Problem | హైదరాబాద్‌లో రోడ్డు కింది బావులు అట్టర్ ఫ్లాప్!
నిర్లక్ష్యం ‘కుండపోత’.. గ్రేటర్ హైదరాబాద్‌కు వాన గండం