నిర్లక్ష్యం ‘కుండపోత’.. గ్రేటర్ హైదరాబాద్‌కు వాన గండం

ఇక్కడ జవాబుదారీతనం లేకపోవడం ‘జోరువాన’! అలసత్వం ‘ఉపరితల ఆవర్తనం’! కొరవడిన దూరదృష్టి ‘అల్పపీడన ద్రోణి’! నిర్లక్ష్యం ‘కుండపోత’! భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూస్తామనే హామీలు ‘వరద’! ఇది చినుకుపడితే చిగురుటాకులా వణికిపోయే హైడరాబాద్‌!

నిర్లక్ష్యం ‘కుండపోత’.. గ్రేటర్ హైదరాబాద్‌కు వాన గండం

ఉస్మానియా విశ్వవిద్యాలయ భవన సముదాయాలు ఆధునికతకు అద్దం పట్టేలా, తరతరాలు గుర్తుంచుకునేలా ఉండేందుకు నిజాం రాజు ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. నిపుణులైన వారితో కమిటీ వేసి, ఆరేడు దేశాలకు పంపించి, అక్కడి విశ్వ విద్యాలయాల నిర్మాణ శైలి ఎలా ఉందో పరిశీలించి నివేదించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి వేల మంది ప్రాణాలు కోల్పోతే చలించిన నిజాం రాజు.. వరద ముప్పు నుంచి పౌరులను కాపాడేందుకు మహత్తర నిర్ణయం తీసుకుని అమలుపరిచారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రత్యేకంగా పిలిపించి జంట జలాశయాలను నిర్మించి, ఎగువ ప్రాంత వరదలకు అడ్డుకట్ట వేశారు. ఆయనకు ఉన్న ముందు చూపు, దార్శనికత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేనే లేదని, ప్రస్తుతం పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అంతకన్నా లేదని నగర పౌర సమాజం విమర్శిస్తున్నది. నగరంపై కుండపోత వానల కంటే.. ప్రభుత్వం కుండపోతలా కురిపిస్తున్న నిర్లక్ష్యంతోనే నగరం నానా అవస్థలు పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

Hyderabad Roads Waterlogging | హైదరాబాద్, ఆగస్ట్‌ 18 (విధాత): గ్రేటర్‌ హైదరాబాద్‌ కోట మందికిపైగా నివసిస్తున్న నగరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతూ, ఎక్కడి నుంచి వచ్చినవారికైనా ఉపాధి కల్పిస్తున్న మహా నగరం. దీనిపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు స్పష్టమైన అవగాహనతోపాటు.. కనీస దూరదృష్టి లేదన్న విమర్శలు చాలా కాలం నుంచే ఉన్నాయి. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండనే తీరుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ‘హైదరాబాద్ నగరం న్యూయార్క్‌ నగరాన్ని మించిపోయిందని ఎవరైనా సెలెబ్రేటీ చెబితే వెంటనే తమ భ‌జ‌న బృందంతో సోషల్ మీడియాలో రంగురంగుల వీడియోలు, ఫొటోలతో ప్రచారం చేయించుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తమ చలవేనని గొప్పలు చెప్పుకుంటారు. కానీ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతే పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోరు. వర్షం వస్తే రోడ్లపై నిలువ ఉంటాయని, చెరువులు, నాలాలు కబ్జా కావడంతోనే ఈ దుస్థితి వచ్చిందంటూ దానిపై నెట్టేసి తమ బాధ్యతల నుంచి తప్పుకుంటారు’ అని ఒక పౌరుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. గత నాలుగు దశాబ్ధాలుగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన సమస్యలు ఏంటీ, ఏ సమస్యకు ప్రాముఖ్యత నివ్వాలి, ఎలా పరిష్కరించాలనే దానిపై పాలకులకు స్పష్టత, దీర్ఘకాలిక లక్ష్యం లేనే లేదని ఆయన అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై శాస్త్రీయంగా ఆలోచించకపోవడం పౌరులకు శాపంగా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసే చొరవ తీసుకోవడం లేదు. అప్పుడెప్పుడో కిర్లోస్కర్ కమిటీ నివేదిక ఇవ్వగా అది దుమ్ముకొట్టుకుని అటకెక్కింది. తాజాగా జీఐఎస్ పేరుతో నాలాలు అనుసంధానం అంటూ ప‌ట్ట‌ణాభివృద్ధి అధికారులు భజన మొదలు పెట్టారు. కాంటూర్ ను బట్టి నాలాలను ఎక్కడి వరకు తీసుకువెళ్లాలి? వాన వచ్చినప్పుడు నీళ్లు ఎక్కడెక్కడ నిల్చుంటున్నాయి? అనే అంశాలపై ఇటీవలే జీఐఎస్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే పై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది అమలు చేస్తే హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా అవతరిస్తుందని, నీళ్లు కన్పించవని చెబుతుండడం విశేషం.

గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించి పోతున్నది. వర్షం వస్తుందంటే జనాల్లో వణకుడు మొదలయి భీతిల్లిపోతున్నారు. ఒకటి రెండు సెంటిమీటర్ల వాన వస్తే రోడ్లపై వాహనాలు నెమ్మదిస్తాయి. ఇక ఆ పైన నాలుగైదు సెంటిమీటర్లు వర్షం వస్తే ఇక అంతే సంగతులు. రోడ్ల మీద వర్షం నీరు గోదావరి నది మాదిరి వరదలై పారుతుంది. ఒకటి రెండు అడుగులు కూడా వాహనాలను ముందుకు కదలనిచ్చే పరిస్థితి ఉండదు. ఏడెనిమిది సెంటిమీటర్ల వాన వస్తే నడిరోడ్లపై వాహనదారులు జాగారం చేయాల్సిందే. గంటల కొద్దీ రోడ్ల మీద వేచి ఉండక తప్పదు. నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఇంటికి చేరుకోవడానికి రెండు నుంచి మూడు గంటల సమయం తీసుకుంటుంది. జంక్షన్లు వాహనాలతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇక మాదాపూర్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి ఉంటాయి. ఈ మూల ఆ మూల అనే తేడా లేకుండా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్‌లో కిక్కిరిసి పోయి వాహనదారుల సహనానికి పరీక్ష పెట్టింది. వర్షాల ధాటికి ట్రాఫిక్ ను నియంత్రించలేమంటూ సైబరాబాద్ పోలీసులు చేతులెత్తేశారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాల్సిందిగా పోలీసులు వేడుకోవాల్సిన దుస్థితి తెచ్చారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఝంజాటం తప్పడం లేదు.

భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అయి జనజీవనానికి ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడం, ఏదో చేస్తున్నామని ప్రకటనలు గుప్పించడం మినహా ఆ తరువాత అవి కార్యరూపం దాల్చడం లేదని పరిశీలకులు విమర్శిస్తున్నారు. వరదనీటి ముప్పుపై శాస్త్రీయ కోణంలో సమస్యను పరిష్కరించేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదని అంటున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ఎక్కడెక్కడ వాన నీళ్లు పొంగిపొర్లుతూ ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షం తరువాత తలెత్తుతున్న సమస్యలు ఏంటి? ట్రాఫిక్‌కు కలుగుతున్న అంతరాయాలేంటి? అనే విషయాలపై ప్రభుత్వ పెద్దలు సూక్ష్మస్థాయిలో సమీక్షించడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో యావత్ గ్రేటర్ హైదరాబాద్ పండుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా, ప్రధాన రహదారులు, గల్లీ రోడ్లు చెరువులను తలపించాయి. ప్రభుత్వం ఉందా, జీహెచ్ఎంసీ అధికారులు పనిచేస్తున్నారా అంటూ ప్రజలు దుమ్మెత్తిపోశారు. ప్రజాగ్రహాన్ని గమనించారో మరే కారణమో తెలియదు కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్ పేట మైత్రివనం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ముంపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తరువాత ప‌ట్ట‌ణాభివృద్ధి అధికారులు, మూసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏం చర్యలు తీసుకుంటారో, నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో వారికే తెలియాలి.

ఇవి కూడా చదవండి..

Hyderabad Rain Traffic Problem | హైదరాబాద్‌లో రోడ్డు కింది బావులు  అట్టర్ ఫ్లాప్!
Best Free Indian Government Apps | క్యూలలో సమయం వృథా కాకుండా – ఈ 12 ఉచిత ప్రభుత్వ యాప్‌లతో మీ పని సులభం
Kaleshwaram | కాళేశ్వరం కల నిజమవుతుందా?.. మేడిగడ్డ పునరుద్ధరణకు ప్రభుత్వం కసరత్తు