Group Politics Peddapalli | పెద్దపల్లిలో పెద్ద చిక్కు! రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ

- పోటాపోటీగా మంత్రి, ఎంపీ కార్యక్రమాలు
- సరస్వతి పుష్కరాలతో విభేదాలు తారస్థాయికి
- వంశీకృష్ణకు ప్రొటోకాల్ పాటించలేదని విమర్శ
- దుద్దిళ్ల భార్య దేవాదాయ ముఖ్య కార్యదర్శి
- ఇద్దరూ కలిసే వంశీ ఫొటో, పేరు లేకుండా చేశారు
- మండిపడుతున్న ఎంపీ వంశీ మద్దతుదారులు
- ఉన్నతాధికారులపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
Group Politics Peddapalli | పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ఎవరికి వారుగా తమ వ్యతిరేక వర్గాలతో తలపడుతున్నారు. ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న గ్రూపు రాజకీయాలు సరస్వతి పుష్కరాల సందర్భంగా బయటపడ్డాయి. ఇది మున్ముందు ఎంతదూరం వెళ్తుందోనని కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. విజయం సాధించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు విభేధాలను పక్కనబెట్టి అందరూ కలిసి పోరాడతారు. గెలుపొందిన తరువాత పరిస్థితులను బట్టి గ్రూపు రాజకీయాలు మొదలుపెడతారనేందుకు పెద్దపల్లి నిదర్శనంగా నిలుస్తున్నది. పెద్దపల్లి (ఎస్సీ) పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి (ఎస్సీ), చెన్నూరు (ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ).. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణా రావు, మంథని నుంచి మంత్రి డీ శ్రీధర్ బాబు, రామగుండంలో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్, చెన్నూరునుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా 2024లో గెలుపొందారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి మనుమడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు. వివేక్ కుటుంబం కాంగ్రెస్‌లో చేరే ముందు పార్టీ నాయకులతో చర్చించిన తరువాతే కండువా కప్పుకున్నారు. తమ కుటుంబంలో ఇద్దరికి రెండు అసెంబ్లీ, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కోరగా అంగీకరించిందని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఆ ప్రకారంగానే మూడింట్లో విజయం సాధించారు.
ఆరు నెలలుగా గ్రూపు రాజకీయాలు
గత ఆరు నెలలుగా పార్లమెంటు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి తనకు మంత్రి పదవి కావాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే అదే జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కూడా తన ప్రయత్నాల్లో తానున్నారు. వివేక్‌కు సీఎం రేవంత్ రెడ్డి మద్ధతు ఉండగా, ప్రేమ్ సాగర్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి సహకారం ఉందని సమాచారం. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న తమను కాదని నిన్న మొన్న చేరిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారని పార్టీ సమావేశాల్లో ప్రేమ్ సాగర్ ఏకరవు పెడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేరానని, ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని వివేక్ ఒత్తిడి తెస్తున్నారు. వీరిద్దరి వివాదం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలకు కూడా మింగుడు పడటం లేదు. వివేక్‌కు పదవి రాకుండా ఎవరికి వారుగా ముఖ్యమంత్రి, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలపై ప్రభావం చూపిస్తున్నారని తెలుస్తున్నది. ఆ కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మళ్లీ వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం మూలంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు.
దళిత ఎంపీ కావడంతోనే సరస్వతీ పుష్కరాల్లో అవమానం!
స్థానిక ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విషయంలో తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రొటోకాల్ పాటించలేదు. ఆహ్వాన పత్రికలో ఆయన పేరు పెట్టకపోవడమే కాకుండా, ఫొటోను కూడా ముద్రించకపోవడం ఎంపీ ఆగ్రహానికి కారణమైంది. కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తుండగా వంశీ అనుచరులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి వంశీ వర్గీయులు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయుల చేత ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దళిత ఎంపీకి అవమానం చేశారని పార్లమెంటులో హౌస్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని, సంబంధిత ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని కోరతామన్నారు. బాధ్యులైన అధికారులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డిమాండ్లు చేశారు. మొదటి నుంచి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో వివేక్ కుటుంబం సఖ్యతగానే ఉంది. అయినప్పటికీ శ్రీధర్ బాబు దూరం పెడుతూ వస్తున్నారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వివేక్ మంత్రి అయితే తనకు ఇబ్బంది ఉంటుందని, భవిష్యత్తులో వంశీ ఆధిపత్యం పెరుగుతుందనే ఆందోళనలో శ్రీధర్ ఉన్నారు. ఈ కారణంతోనే దూరంగా ఉంటూ, అంతర్గతంగా వర్గపోరును ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మంత్రి భార్యే
తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామైయర్ ఉన్నారు. ఆమె మంత్రి శ్రీధర్ బాబు భార్య. ఇద్దరూ కలిసి కుట్రపన్ని వంశీకి సరస్వతి పుష్కరాల ఆహ్వాన పత్రికలో పేరు పెట్టలేదని, ఫొటోలు లేకుండా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన ఎంపీ వంశీ మంత్రి శ్రీధర్ కు కనీసం సమాచారం ఇవ్వకుడా స్వగ్రామం వెళ్లి వచ్చారు. ఆ గ్రామంలో మంత్రికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం అయి వచ్చారు. ఈ ఘటనతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగిందని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప సర్ధుబాటు అయ్యే స్థితి లేదని కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు అంటున్నారు.