• Telugu News
  • /News

Harish Rao | ప్రభుత్వ వైఫల్యంతో గురుకులాలు నిర్వీర్యం : మాజీ మంత్రి టి.హరీష్ రావు

Reported by: Jagan Mohan Talluri | వార్త‌లు | Jun 30, 2025, 3:05 pm IST
Read Time: 4 mins
Harish Rao | ప్రభుత్వ వైఫల్యంతో గురుకులాలు నిర్వీర్యం : మాజీ మంత్రి టి.హరీష్ రావు

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనా వైఫల్యంతో నిర్వీర్యం అవుతున్నాయని…విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం శోచనీయమని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి నుండి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయన్నారు. బకాయిలు చెల్లించకుంటే జులై 1 నుండి అన్ని రకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇంతవరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో యూనిఫామ్ ఇవ్వకపోవడంతో పిల్లలు పాత, చినిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నారన్నారు. పదేళ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థ, రేవంత్ పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమన్నారు. దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద పిల్లల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను, భవనాల అద్దె బకాయిల విడుదలకు, యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగుల తక్షణమే పంపిణీకి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని కోరారు.