Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో.. అసంతృప్తి మంటలు!

Telangana | Congress | Cm Revanth Reddy
- గెలిచి ఏడాదిన్నర అవుతున్నా..
- ఇంత వరకూ నియోజకవర్గాల్లో పనుల్లేవు
- నియోజకవర్గ అభివృద్ధి నిధులు సున్నా
- వాటి కోసం మంత్రుల వద్ద దేబిరింపులు
- వాళ్లు కనికరిస్తేనే అంతో కొంతో వెసులుబాటు
- పథకాల అమలు అంతమాత్రంగానే..
- ప్రజల నమ్మకాన్ని చూరగొనేది ఎట్లా?
- తీవ్ర మథనంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విధాత): కోట్లు ఖర్చుపెట్టి గెలిచారు! కానీ.. కోటిన్నర పని కూడా నియోజవర్గాల్లో చేయలేదు! పదవిలోకి వచ్చి ఏడాదిన్నర అయింది.. మిగిలింది మూడున్నరేళ్లే. అందులోనూ ఆర్నెళ్లు.. ఎన్నికల ప్రచారానికే సరిపోతుంది. అప్పటిదాకా ఇలాగా పనులేమీ చేయకుండా ఉంటే.. ప్రజలు తమను గ్రామాల్లోకి కూడా రానిచ్చే పరిస్థితులు ఉండవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. నియెజకవర్గాల్లో కనీస పనులు చేయించలేని తమ స్థితితో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కనీసం ఏదైనా రోడ్డో.. లేక చిన్నపాటి పనిని కార్యకర్తలు అడిగుతే కూడా చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. తన కోసం నిలబడ్డ కార్యకర్తలను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కొంత మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 జనవరి 9వ తేదీన ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధిని కేటాయిస్తుందని ప్రకటించారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించే బాధ్యతను పూర్వ జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 2024 ఫిబ్రవరిలో 119 నియోజకవర్గాలకు కలిపి రూ.1,190 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులలో రూ.2 కోట్లు విద్యా మౌలిక సదుపాయాలకు, తాగునీటికి కోటి. రూ.50 లక్షలు కలెక్టరేట్లు లేదా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కేటాయించింది. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను జిల్లా ఇంచార్జ్ మంత్రులు ఆమోదిస్తేనే నిధులు విడుదల అవుతాయి. వీటికి ఈ మెలిక పెట్టడంతో ఎమ్మెల్యేలు తమ పనులకు మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నియోజకవర్గ అభివృద్ధి నిధి భారతదేశంలో 1993 నుంచి అమలులో ఉన్నది. ఎంపీలకు ఎంపీ లాడ్స్ కింద ఈ నిధులు విడుదల చేస్తున్నారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజవర్గ అభివృద్ధి కోసం కాన్‌స్టెన్సీ డెవలప్‌మెంట్ నిధులు విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు అంతా తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడానికి బీఆరెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులను ఒక్క నియెజకవర్గానికి ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేస్తామని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు చివరగా 2022-23లో మొదటి రెండు క్వార్టర్ల కింద నియోజకవర్గానికి రూ.1.50 కోట్ల చొప్పున ఆంగ్లోఇండియన్ ఎమ్మెల్యేతో కలుపుకొని 120 ఎమ్మెల్యేలు, 39 ఎమ్మెల్సీలకు రూ.238.50 కోట్ల నిధులు కేటాయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులేవి?
2023 చివరలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ది నిధులు విడుదల కాలేదు. దీని స్థానంలో రూ.10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధిని కేటాయించారు. ఇవి119 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే వర్తిస్తాయి. కానీ ఈ నిధుల విడుదలకు పూర్వ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదం ఉండాల్సి రావడంతో ఎమ్మెల్యేల చేతుల్లో నయాపైస ఖర్చు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. పైగా మంత్రుల అనుమతి అనే నిబంధనతో విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఈ నిధులు అందని ద్రాక్షలాగే అయింది. ఎమ్మెల్సీలకు అడిగే అవకాశం కూడా లేదని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు.
మంత్రులను దేబిరించాల్సిందే
ఒక మురికి కాలువకు నిధులు మంజూరు చేయాలన్నా, ఏదైనా గ్రామంలో సీసీ రోడ్డు వేయాలన్నా.. ఎక్కడైనా మంచినీటి కోసం నల్లా లేదా ఒక బోరు వేయాలన్నా మంత్రులను దేబిరించాల్సిందేనని ఒక ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అదే తమకు సీడీఎఫ్ నిధులుంటే అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసుకొని పని చేయించుకుంటాం కదా అని అన్నారు. దేశంలో ఎక్కడైనా సీడీఎఫ్ నిధులు రాజకీయ బేధం లేకుండా ప్రజా ప్రతినిధులందరికీ విడుదల చేస్తారని, కానీ రేవంత్ రెడ్డి విపక్షపార్టీలతో స్వపక్ష ఎమ్మెల్యేలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రాజకీయాలు చూడకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికి సీడీఎఫ్ నిధులు కేటాయించారన్నారు. అభివృద్ధి విషయంలో వివక్ష చూపడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
మంత్రి వర్గంలోనే విభేదాలు
కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. ఇక్కడ ఎవరికి వారే పెద్ద లీడర్. ఒక ఎమ్మెల్యే వెళ్లి మంత్రిని ఫలానా పని చేయమని అడగలేని వాళ్లు కూడా ఉన్నారు. మంత్రి వర్గంలోనే ఈ విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసే నిధులకు నేరుగా సీఎంను అడిగితే కాస్త ఎక్కువ వస్తాయని బాధితులు చెపితే… ‘నేను సీఎంను అడుగను.. లేఖ రాస్తా.. వస్తే తీసుకోండి… అంతే కానీ నాకంటే జూనియర్ అయిన సీఎంను నేను అడుగడమేమిటి?’ అని అన్నట్లు తెలుస్తోంది. సీనియర్, జూనియర్ అనే విషయాన్ని పక్కన బెడితే రేవంత్ రెడ్డి అవునన్నా కాదన్నా.. ఈ రాష్ట్రానికి సీఎం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కేబినెట్ లో ఉన్న సదరుమంత్రి నేను సీఎంను అడుగను అంటే… ఎమ్మెల్ల్యేల్లో కూడా చాలా మంది సీఎం కంటే.. మంత్రుల కంటే సీనియర్లున్నారు.. అలాంటి వాళ్లు తమ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు విడుదల చేయమని నేరుగా మంత్రులను కలిసి అడుగలేని స్థితి కూడా ఉన్నదని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు.
పథకాల అమలు అంతంత మాత్రమే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలు అంతం మాత్రంగానే ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ విషయంలో క్షేత్ర స్థాయిలో విమర్శలు ఎక్కువయ్యాయని ఒక సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ వద్దకు వచ్చే నాయకులు తమ గ్రామానికి ఏదైనా పని చేయడానికి నిధులు ఇవ్వమంటే తమ వద్ద ఏమిలేదని, అడిగితే మంత్రిని అడగాలి… లేదంటే ఊరుకుండాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు తన సన్నిహితుడి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ‘రూ. 40 కోట్ల వరకు ఖర్చు చేసి, కష్టపడి గెలిచాను.. గెలిచిన తరువాత ఒక పని చేయలేక పోతున్నాను’ అని తన మిత్రుడి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగలేని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఇచ్చే రూ. 10 కోట్ల నిధులు స్వేచ్చగా ఖర్చు చేసుకునే అవకాశం ఎమ్మెల్యేలకు కల్పించాలని కోరుతున్నారు. అలా చేస్తే ఈ మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.30 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసే అవకాశం కలుగుతుందని, ఇది తమకు రాజకీయంగా అనుకూల అంశంగా మారుతుందని చెబుతున్నారు.