లిక్కర్ దొంగల మిగతా దుస్తులు విప్పేందుకు సహకరిస్తా: విజయసాయిరెడ్డి

విధాత: ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్‌లాంటిదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. ‘‘తప్పించుకునేందుకే దొరికిన దొంగలు.. దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారని.. నేను ఏ రూపాయీ ముట్టలేదని తన ట్వీట్ లో తెలిపారు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారని.. వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానుఅని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అని సిట్ తాజా విచారణలో విజయసాయిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కేసిరెడ్డేనని.. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా’’ అని విజయసాయిరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
కాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసిరెడ్డి ఫైర్ అయ్యారు. లిక్కర్ కేసులో సోమవారం కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ విచారించింది. కేసు విచారణను సిట్ వేగవంతం చేయగా..ఇంకోవైపు ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కోంటున్న వైసీసీ నాయకులు పరస్పర విమర్శలు చేసుకోవడం కేసు పట్ల మరింత ఆసక్తి రేపుతోంది.