KCR.. ప్రజా స్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించాడు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

  • By: sr    news    Apr 28, 2025 7:43 PM IST
KCR.. ప్రజా స్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించాడు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

విధాత ప్రత్యేక ప్రతినిధి : కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే నాయిని రేవూరీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పబ్బం కోసం ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలని కేసీఆర్ అంటున్నాడని మండిపడ్డారు.

కెసిఆర్ తన పాలనలో ప్రజలు ప్రభత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ధర్నా చౌక్ ను ఎత్తివేసారు, అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. తన రాజకీయ పబ్బం గడుపు కోవడానికే ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 10ఏళ్ల కేసీఆర్ పాలనలో వాల్ల అవినీతి, అక్రమాలకు అధికారులను వాడుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు వత్తాసు పలికిన అధికారులు కొందరు దేశం విడిచి పారిపోయారు, మరికొందరు జైలుకు వెళ్తున్నారని అన్నారు.

BRS చేయలేని అభివృద్ధి కాంగ్రెస్ చేస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో ఫెయిల్ అయిందని కేసీఆర్ అంటున్నారనీ కానీ మీరు 10ఏళ్లలో చేయలేనివి 16నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కడియం అన్నారు. 2లక్షల రుణ మాఫీ చేసింది నిజం కాదా? ఒకేసారి 25లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేసింది నిజం కాదా? రాష్ట్రం లో కుల గణన పూర్తి చేసింది నిజం కాదా?మూడు దశబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్దత కల్పించింది నిజం కాదా? 10ఏళ్ల పాలనలో మీరు తేలేని పెట్టుబడులు ఏడాదిన్నరలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది నిజం కాదా? దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నాలకు 500బోనస్ ఇచ్చింది నిజం కాదా? రాష్ట్రంలో 1కోటి కార్డుల ద్వారా 3కోట్ల 10లక్షల మందికి ఉచిత సన్న బియ్యం పంపిణీ చేస్తుంది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. పేద ప్రజలపైన ప్రేమ ఉంటే మీరు ఎందుకు సన్న బియ్యం పంపిణీ చేయలేదన్నారు. 22వేల 500కోట్లతో ఒకే ఏడాదిలో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం సరైంది కాదని గుర్తుచేశారు. గురివింద గింజ తన నలుపును తాను ఎరుగదు అన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తక్షణం ఆపరేషన్ కాగర్ ని నిలిపివేయాలి

వెంటనే ఆపరేషన్ కాగర్ ని నిలిపివేసి తక్షణమే మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని కడియం కోరారు. కేంద్ర ప్రభుత్వం చత్తిస్ ఘడ్ అడవులలో రక్తపు ఎరులు పారిస్తోందని విమర్శించారు. కేంద్రం చర్చలకు సిద్ధమని అంటున్న ఎన్కౌంటర్లు కొనసాగించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. టెర్రరిస్టులను, మావోయిస్టులను ఒకే కోణంలో చూడవద్దన్నారు. ఎన్ కౌంటర్లలో అమాయకులైన గిరిజనుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.