Simachalam | అప్పన్న చందనోత్సవం ఘటన విచారణలో కీలకాంశాలు

విధాత: విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెంది ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ విచారణ ప్రక్రియం ప్రారంభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కమిటీ 72గంటల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో విచారణ వేగవంతం చేసింది.
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన సభ్యులు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కూడిన త్రిసభ్య కమిటీ ఘటనా స్థలానికి చేరుకుని గోడ కూలిన ఘటనపై విచారణ నిర్వహించింది. గోడ నిర్మించిన కాంట్రాక్టర్ ను, ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించింది. 4 రోజుల్లోనే రిటైనింగ్ వాల్ ఎలా కట్టవ్ అంటూ త్రీసభ్య కమిటీ కాంట్రాక్టర్ ను నిలదీసింది.
గోడ కట్టేందుకు సమయం లేదని చెబుతున్నప్పటికి టెంపుల్ అధికారులు వినలేదని.. నా మీద ఒత్తిడి తేవడంతోనే గోడను అలా కట్టాల్సి వచ్చిందని..నేను చేయనని చెప్పినా నా మీద ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్ వెల్లడించాడు. గోడ కట్టే సమయంలో ఇంజనీర్ వచ్చారా అన్న ప్రశ్నకు మొదట రెండు రోజులు ఇంజనీర్ అధికారులు రాలేదని..తర్వాత వచ్చి వెళ్లారని కంట్రాక్టర్ తెలిపాడు. అనంతరం ఇంజనీరింగ్, దేవాదాయ శాఖ అధికారులను, సిబ్బందిని, స్థానికులను, కార్మికులను విచారించారు.
చందనోత్సవం దగ్గరపడుతుండటంతో హడావుడిగా గోడ కట్టేసి, మెట్లకు టైల్స్ అతికించి వారం రోజుల క్రితమే వినియోగంలోకి తెచ్చారని.. అందులో నాణ్యతను ఎవరు పరిశీలించలేదని కమిటీ గుర్తించింది. వర్షపు నీరు పెద్దఎత్తున రిటెయినింగ్ వాల్ వైపు ప్రవహించడంతో నీటి ఉద్ధృతికి గోడ అడుగున మట్టి కోతకు గురై గోడను బలహీనపరిచినట్లుగా వెల్లడైంది. విచారణలో అవసరమైన వారిని ప్రశ్నించే ప్రక్రియను కమిటీ కొనసాగిస్తుంది.