Warangal Politics | ఒక్కటైన వరంగల్ నేతలు.. ఒంటరైన కొండా దంపతులు

  • By: TAAZ    news    Jun 20, 2025 8:17 PM IST
Warangal Politics | ఒక్కటైన వరంగల్ నేతలు.. ఒంటరైన కొండా దంపతులు

Warangal Politics | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఒంటరయ్యారా? అంటే ఔననే అంటున్నాయి తాజా పరిణామాలు. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ జిల్లా పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు, మేయర్ ఒక్కటయ్యారు. ఇంతకాలం అంతర్గతంగా నివురుగప్పినట్టు ఉన్న సమస్యలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. వరంగల్‌ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పతాకస్థాయికి చేరి ఆ పార్టీ పరువూ ప్రతిష్ఠా బజారునపడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొండా దంపతులపై తీవ్ర అసంతృప్తి?

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రి కొండా దంపతులు వర్సెస్ ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అనే విధంగా పరిస్థితి మారింది. దీంతో జిల్లాలో పార్టీలో వర్గ విభేదాలు మరింత ముదిరాయి. అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు విపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు సొంత నేతలే అవకాశం కల్పిస్తున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను నాయకులు బజారుకు ఈడ్చుతున్నారు. చాలా కాలంగా లోపల విభేదాలు మసలుతూ ఉన్నాయి. అవి కాస్తా కొండా మురళి సొంత పార్టీకి చెందిన కడియం, రేవూరి, బస్వరాజులను హేళన చేస్తూ చేసిన పరుషవ్యాఖ్యలతో మరింత అగ్గిరాజేసినట్టయింది. కొండా మురళి వ్యాఖ్యలతో సదరు నేతలు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వారి వర్గం వారు చెబుతున్నారు. గత కొద్దికాలంగా కొండా దంపతులు జిల్లాలో ఒంటరిగా మారారని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ఎమ్మెల్యే సైతం మంత్రికి మద్ధతుగా లేకపోవడంతో అధిష్ఠానం వద్ద సురేఖ పరపతి తగ్గిపోయిందనే చర్చ వరంగల్‌ పార్టీ వర్గాల్లో సాగుతున్నది. మంత్రిగా ఉండి కూడా జిల్లా నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే మద్ధతు లేకపోవడాన్ని అధిష్ఠానం కూడా తీవ్రంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొండా దంపతుల ఒంటెత్తుపోకడలను సహించలేని ఎమ్మెల్యేలంతా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన వరంగల్ పార్లమెంటు ముఖ్యనేతల సమావేశంలో కూడా మంత్రి సురేఖ, మురళికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. పైగా ఇటీవల ఏ చిన్న పరిణామం జరిగినా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అంశం కొండా దంపతుల్లో తీవ్ర అసహనాన్ని పెంచినట్లు భావిస్తున్నారు. వీటికి తోడు ఇటీవలే మెదక్ జిల్లా ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి సురేఖను తొలగించారు. దీనికి కూడా జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదులే కారణమంటున్నారు. సీఎం రేవంత్ ఒక్క సురేఖనే కాకుండా ఉత్తమ్, కోమటిరెడ్డిలను సైతం ఇంచార్జ్ మంత్రుల బాధ్యతల నుంచి తొలగించారు. వారిద్దరు కీలక శాఖలు నిర్వహిస్తున్నందున తప్పించారనీ, సురేఖ తొలగింపునకు ఇతర కారణాలున్నాయనే ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. జిల్లాకు చెందిన చివరికి పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేను కూడా కలుపుకొని పోకుండా కొండా దంపతులు వ్యవహరిస్తున్నారని ఇతర ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశాన్ని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. పైగా ఇతరుల నియోజకవర్గాల్లో తమ గ్రూపు రాజకీయాలు చేయడంతో పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట తదితర నియోజవకర్గ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీరికి తోడు తూర్పులో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు కొండా వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలున్నాయి. మేయర్ సుధారాణి తనకు తగిన గౌరవం దక్కకుండా పెత్తనం చేస్తున్నారనే ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి స్వర్ణకు కొండా దంపతుల మధ్య కూడా ఉప్పూనిప్పులా ఉంది. ఒక్కరితో కూడా సఖ్యత లేకపోవడంతో వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేల ఫైర్

రాహుల్ జన్మదినం సందర్భంగా నిన్న కొండా మురళి సొంత పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు విపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెలంతా మండిపడుతున్నారు. అందరి వ్యక్తిత్వత్వాలను కించపరిచే విధంగా హేళన చేస్తూ మాట్లాడిన మాటలను జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ ఇంటిలో శుక్రవారం సమావేశమై మురళి వ్యాఖ్యలపై సీరియస్‌గా చర్చించారు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే కాకుండా పార్టీ పరువును రోడ్డున పడేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కొండా దంపతుల తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదుచేయాలని నిర్ణయించారు. తమను విమర్శిస్తూ కులం కార్డును వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సమావేశం అనంతరం నాయిని మీడియాతో మాట్లాడారు. కొండా దంపతుల వ్యవహార శైలిపై నేరుగా మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్టీ ఊరుకోదని తేల్చిచెప్పారు. కులాలను అడ్డం పెట్టుకోని వ్యవహరించొద్దన్నారు. ఈ పాపాలను ఇంకెంత కాలమో తాము మోయలేమని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఏదో ఒక లొల్లి పెట్టిస్తున్నారని, కొండా దంపతుల తీరుపై అటో ఇటో తేల్చుకునేవిధంగా హైకమాండ్‌కు రిప్రజెంటేషన్‌ ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా అధక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంక్రటాం రెడ్డి హాజరయ్యారు. మేయర్ సుధారాణి కూడా మద్ధతు తెలియజేసినట్లు సమాచారం.

అధికారమిస్తే అంతర్గత కుమ్ములాట

తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు టర్ములు అధికారానికి దూరమైంది. మూడవ దఫా బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం 11కు చేరింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మహిళలు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలకు మంత్రులుగా అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధికి కృషిచేయాల్సిన మంత్రి సురేఖ తమను పట్టించుకోవడంలేదనే అభిప్రాయంతో ఎమ్మెల్యేలుండడం ఆమెకు మైనస్ గా మారింది. ఒక్క ఎమ్మెల్యే సపోర్డు కూడా లేక పోవడంతో మంత్రి ఒంటరిగా మిగిలారు. ఈ పరిణామాల వల్ల పార్టీలో వర్గపోరు తీవ్రమవుతోంది.