Krishna Water Dispute | కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్‌ది ద్రోహం, కాంగ్రెస్‌ది నిర్లక్ష్యం!
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆరెస్, కాంగ్రెస్ మధ్య ఉత్త నీడలతో యుద్ధం జరుగుతున్నదా? నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు జరుగుతున్న అన్యాయంపై ఈ రెండు పార్టీలకూ చిత్తశుద్ధి లేదా? జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
srisailam dam on krishna river
- పని తక్కువ, పంచాయతీ ఎక్కువ
- ఆడలేక ఆంధ్రపై ఏడుపు
- చేతగాక చంద్రబాబుపై దుమ్ము
Krishna Water Dispute | సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ప్రధానంగా గళమెత్తింది నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాల గురించే! అప్పటికి ప్రధానంగా చర్చ జరుగుతున్నది కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించే! సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలన్నింటికీ ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ప్రేక్షక పాత్రా కారణమే! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కొద్ది మాసాల ముందు.. అంటే 2013లో బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పునఃపంపిణీపై తుది ఆదేశాలు ఇచ్చింది. బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని అప్పటికే తెలంగాణవాదులు డిమాండు చేస్తూ వస్తున్నారు. కానీ ట్రిబ్యునల్ ఆ పని చేయలేదు. ఎప్పటిలాగే కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి కేటాయింపులు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం కొట్లాడగా.. కొట్లాడగా.. ఎనిమిదేళ్ల తర్వాత చాలా కాలయాపన అనంతరం కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరులో ఆంధ్ర, తెలంగాణ మధ్య నీటికేటాయింపులపై విచారణ బాధ్యతను తిరిగి బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించింది. ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది. అయితే.. ఈలోగా తెలంగాణలో జరిగిందేమిటి? బ్రజేశ్ ట్రిబ్యునల్ తుది ఆదేశాలు వచ్చేలోపు.. తెలంగాణ 299 టీఎంసీలు, ఆంధ్ర 512 టీఎంసీలు వాడుకోవాలని నిర్ణయించాయి. ఇది శాశ్వత ఒప్పందం కాదు.. తాత్కాలిక అవగాహన మాత్రమే. ఒప్పందం సరే.. కృష్ణా జలాల్లో మన వాటాను నికరం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వాలు చేసిందేమిటి? ఎందుకు ఇవ్వాళ బీఆరెస్, కాంగ్రెస్ వీధుల్లోపడి కొట్లాడుకుంటున్నాయి? కృష్ణా జలాలను నిర్లక్ష్యం చేయడంలో ఎవరి నేరం ఎంత?
ఇదీ నాటి అవగాహన!
తెలంగాణ వచ్చిన నాడు అవగాహన ఏమంటే.. కృష్ణా ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసుకోవాలి. బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చేలోగా.. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి, జల వినియోగం చూపించాలి. కానీ జరిగిందేమిటి? విపరీతమైన కాలయాపన! పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసే ప్రదేశం జూరాల రిజర్వాయర్ నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు మారింది. ముందు రెండు టీఎంసీలు ఎత్తిపోయాలనుకున్నది ఒక టిఎంసీకి తగ్గింది. 90 టీఎంసీలను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో వివరించాలని కేంద్రం కొర్రీలు వేసింది. ఆంధ్ర రాష్ట్రం గోదావరి నుంచి మళ్లించుకునే 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలు, తెలంగాణలో మైనర్ ఇరిగేషన్‌లో ఆదా చేసే 45 టీఎంసీలు ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తామని తెలంగాణ చెప్పింది. మైనర్ ఇరిగేషన్‌లో ఎక్కడ ఎలా పొదుపు చేస్తారో లెక్కలు చెప్పాలని కేంద్రం మళ్లీ కొర్రీ వేసింది. ఇప్పుడు పంచాయితీ నడుస్తున్నది కూడా ఇదే విషయంపై.
ఇక్కడ బీఆరెస్, కాంగ్రెస్ నాయకులకు ఒక కథ చెప్పాలి. అది.. పోతిరెడ్డిపాడు కాలువ (రెగ్యులేటర్) కథ!! పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 11500 క్యూసెక్కుల నీటిని తరలించుకోవడానికి తవ్వారు. ఇది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాకముందు జరిగిపోయిన విషయం. రాజశేఖర్‌రెడ్డి రాగానే పోతిరెడ్డిపాడు కాలువకు మరో 44000 క్యూసెక్కుల నీటిని తరలించే కాలువను జోడించాలని నిర్ణయించారు. ఆ కాలువకు కూడా తొలుత ఏ అనుమతులూ లేవు. నికర జలాల కేటాయింపులే లేవు. ఎన్ని నీళ్లు.. ఎలా తరలిస్తారన్నదానికి.. పత్రాలపై ఎలాంటి లెక్కలూ చూపలేదు. పోలీసులను కాపలా పెట్టి, ఎవరినీ ఆ దరిదాపులకు రాకుండా కట్టడి చేసి.. కాలువ తవ్వకం పూర్తి చేశారు. వరద జలాలను తరలించేందుకు తాను ఈ కాలువను విస్తరిస్తున్నట్టు రాజశేఖర్‌రెడ్డి చేప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీ జనార్దన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి వంటివారు అప్పట్లో ఆందోళన చేశారు. వారిని పోతిరెడ్డిపాడును సందర్శించడానికి కూడా నాటి ప్రభుత్వం అనుమతించలేదు. పోతిరెడ్డిపాడుకు అప్పటికి ఉన్న కేటాయింపులు 15 టీఎంసీలు. తొలుత నీటి తరలింపు సామర్థ్యం రోజుకు ఒక టీఎంసీ. పెద్ద కాలువ తవ్విన తర్వాత అది రోజుకు ఐదు టీఎంసీల సామర్ధ్యానికి పెరిగింది. రాజశేఖర్‌రెడ్డి.. అనుమతుల గురించి, నిధుల గురించి, కేటాయింపుల గురించి, కేంద్రం గురించి ఎదురు చూడలేదు. తన ప్రాంతానికి మేలు చేయదల్చుకున్నారు… చేసిపడేశారు. ఇవ్వాళ, ఈ నీటి సంవత్సరంలో, ఇప్పటివరకు 205 టీఎంసీల నీటిని ఆంధ్రపాలకులు తీసుకు పోగలిగారు. ప్రాజెక్టు పనులన్నీ ఆగమేఘాలపై పూర్తి చేశారు కాబట్టి గరిష్ఠంగా నీటిని వినియోగించుకునే సామర్థ్యం కూడా పెరిగింది.
మరి మన నాయకులేం చేస్తున్నారు?
కేసీఆర్ తన ప్రాధాన్యాన్ని గోదావరి జలాల వైపు మళ్లించారు. అక్కడ 80 వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవసరమే తెలంగాణకు ఏర్పడలేదు. వరుసగా నాలుగేళ్లు బ్రహ్మాండంగా కాలమైంది. శ్రీరాంసాగర్ వరుసగా నాలుగేళ్లూ పొంగిపొర్లింది. కాళేశ్వరం మూడు బరాజ్‌ల ద్వారా నాలుగేళ్లలో మొత్తం 160 టీఎంసీలను ఎత్తిపోస్తే.. అందులో కూడా అరవై టీఎంసీలను తిరిగి గోదాట్లోకే వదలవలసి వచ్చింది. మూడు బరాజ్‌లు తప్ప మిగిలిన కాళేశ్వరం ఎత్తిపోతలు, రిజర్వాయర్లు అన్నీ కూడా శ్రీరాంసాగర్ నీటితోనే పునీతమయ్యాయి. పంటలు బాగా పండాయి. దిగుబడి అసాధారణంగా జరిగింది. ఇదంతా కాళేశ్వరం ఖాతాలో జమ చేసుకుని.. మునుపెన్నడూ లేని ప్రచారం చేసుకున్నారు కేసీఆర్.
కారణాలు ఏమైనా 2023 వరదల ప్రభావానికి మేడిగడ్డ బరాజ్‌లో ఒకటి రెండు పియర్లు కుంగిపోయాయి. గత రెండేళ్లుగా మేడిగడ్డ అవసరం లేకుండానే గోదావరి నీళ్లు పొలాలకు అందుతున్నాయి. ఇదే కేసీఆర్.. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా ఉదాసీన వైఖరిని ప్రదర్శించారు. ఎస్‌ఎల్‌బీసీని మూలన పడేశారు. నిధులు లేవు… సమీక్షలూ లేవు. సొరంగం విధానమే తప్పని.. అందువల్లనే పూర్తి కాలేదని ఒక పనికిమాలిన వాదన బీఆరెస్ నాయకులు చేశారు. కానీ.. అదే బీఆరెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుంచి మేడారం వరకు 21 కిలోమీటర్ల సొరంగం తవ్వకం తమ గొప్పే అని చెప్పుకుంటారు. సగం సొరంగం తవ్వి.. సంవత్సరాల తరబడి వదిలేయడం కారణంగా.. సొరంగ మార్గమంతా నీరుపట్టి తవ్వితే కూలిపోయే దుస్థితి దాపురించింది. పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేయలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల కూడా పూర్తి లక్ష్యాన్ని చేరలేదు. భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు కూడా ఇంకా పెండింగ్ పనులతో కునారిల్లు తున్నాయి.
మన సామర్థ్యం 225 టీఎంసీలే!
ప్రస్తుతానికి నాగార్జున సాగర్ ఎడమకాలువ ద్వారా 105 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ ద్వారా 30 టీఎంసీలు, జూరాల ద్వారా 26, ఆర్డీఎస్ ద్వారా 16, హైదరాబాద్ తాగునీటి పథకం ద్వారా 17 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 30, భీమా, నెట్టెంపాడు ద్వారా 15, మీడియం ఇరిగేషన్ ద్వారా 16 టీఎంసీలు వాడుకుంటున్నట్టు కృష్ణా బోర్డు వార్షిక నివేదిక పేర్కొంటున్నది. అంటే సుమారుగా 255 టీఎంసీలను మాత్రమే వాడుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది. గత పదేళ్లలో తెలంగాణ ఉపయోగించుకున్న జలాలు ఏరోజూ 299 టీఎంసీల లక్ష్యాన్ని చేరలేదు. 2014–16 నుంచి ఇప్పటివరకు గత పదకొండేళ్లలో నాలుగేళ్లు మాత్రమే 250 టీఎంసీలకు పైగా నీటిని తెలంగాణ వాడుకున్నది. కృష్ణా జలాల్లో గత పదకొండేళ్ల తెలంగాణ సగటు వినియోగం 184 టీఎంసీలు కాగా, ఆంధ్ర వినియోగం 588 టీఎంసీలు. పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతలు, భీమా, నెట్టెంపాడు పూర్తయితే మరో 155 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే సామర్థ్యం తెలంగాణకు వస్తుంది.
చెప్పేదేమంటే, సమైక్య రాష్ట్రం మీదనో.. లేదా.. చంద్రబాబునాయుడు మీదనో.. మన నాయకులు చేస్తున్న ఆరోపణలు.. విమర్శలు అన్నీరాజకీయ ప్రేరితమైనవే. వంచనతో కూడిన ఏడుపులు! ఒక్క పోతిరెడ్డిపాడు మాత్రమే కాదు, పట్టిసీమ, ముచ్చుమర్రి, రాయలసీమ ఎత్తిపోతలు, వెలుగోడు… ఇలా.. ఆంధ్ర రాష్ట్రం చేపట్టిన ఏ ప్రాజెక్టులకు.. ఏ మేరకు అనుమతులు ఉన్నాయి? ఏ ప్రాజెక్టుకు ఎన్ని కేటాయింపులు ఉన్నాయి? అయినా అవేవీ ఆగలేదే! ఆంధ్ర నాయకత్వం వారి ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుకుని కూర్చున్నారు. వారు వద్దన్నా ఇప్పుడు నీళ్లు ఆ కాలువల్లో ప్రవహిస్తుంటాయి.
తెలంగాణ నాయకులది కృష్ణా జలాల విషయంలో పని తక్కువ, పంచాయితీ ఎక్కువ! ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే ఎవరు అడ్డం పడ్డారు? పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి.. ఆంధ్ర నాయకత్వానికి సంబంధమేంటి? అసలు విషయం ఇది కాగా, ‘299 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నావు?’ అని ఒకరు.. ‘పాలమూరు రంగారెడ్డికి కేటాయింపులు 45 టీఎంసీలా? 90 టీఎంసీలా?’ అని మరొకరు, ‘డిండి ఎత్తిపోతలు ఎందుకు?’ అని ఇంకొకరు.. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ, ఒకరిని ఒకరు దూషించుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే మనం కృష్ణా జలాలు సాధించేదెప్పుడు?
ప్రాజెక్టులు పూర్తి కావడం, కాకపోవడం నాయకుల రాజకీయ చిత్తశుద్ధి సమస్య. పూర్తయిన ప్రాజెక్టులు, పెండింగ్‌లో ప్రాజెక్టులు.. తెలంగాణ ప్రాజెక్టులూ, ఆంధ్రా ప్రాజెక్టులూ… అన్నింటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారే. నాయకులు ఇచ్చే లక్ష్యాలను బట్టి, విడుదల చేసే నిధులను బట్టి ప్రాజెక్టులు ముందుకు నడవడమో, నత్తనడక సాగడమో జరుగుతుంది. మళ్లీ మళ్లీ చెప్పేదేమంటే తప్పంతా మన నాయకులదే!!
Read Also |
Wolf Supermoon | జనవరి 1, 4 తేదీల మధ్య ‘ఊల్ఫ్ మూన్’! కొత్త ఏడాదికి చందమామ ‘నిండైన’ స్వాగతం!
Telangana New-Politics : నయా రాజకీయం…ఎన్నికల్లో చెప్పనవి చేస్తారు!
Muslim Woman Dance In Old City : పాతబస్తీ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మైనార్టీ మహిళా డాన్స్ వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram