Edupayala Temple | ఏడుపాయల ఆలయాన్ని ముంచెత్తిన మంజీరా…
మంజీరా వరదల కారణంగా మెదక్‌లో ఏడుపాయల ఆలయం ముంచెత్తి, భక్తులు రాజగోపురంలో మాత్రమే దర్శనం పొందుతున్నారు.

Edupayala Temple | ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏడుపాయల దేవాలయం ఆరు రోజులుగా జలదిగ్భంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్టకు 69 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఏడుపాయల అమ్మవారి గర్బగుడిని మంజీరా నీరు ముంచెత్తింది. దీంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఇక్కడే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏడుపాయల ఆలయానికి రావద్దని ఆలయ అధికారులు ప్రకటించారు. మంజీరా వరద నీరు వస్తున్నందున ఆలయాన్ని మూసివేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మంజీరా నదికి వరద పోటెత్తింది. సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తోంది. ఈ ప్రాజెక్టుకు 39,009 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తోంది. 43,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 29.917 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం 19.534 టీఎంసీల నీరుంది.