Megha Engineering penalty | మహారాష్ట్ర ‘మేఘా’ ఆఫర్‌!

అక్రమ మైనింగ్ నిర్వహించిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు విధించిన అపరాధ రుసుం రూ.94.6 కోట్లను మహారాష్ట్ర రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ మాఫీ చేసింది. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఇది కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన అఫీషియల్ ఖాతా

  • By: Subbu    news    Sep 11, 2025 12:30 AM IST
Megha Engineering penalty | మహారాష్ట్ర ‘మేఘా’ ఆఫర్‌!
  • 94 కోట్ల ఫైన్ మాఫీ చేసిన సర్కార్‌
  • బాండ్లు కొనుగోళ్లకు నజరానా?
  • కేరళ కాంగ్రెస్ ఎక్స్ ట్వీట్

హైదరాబాద్, సెప్టెంబర్‌ 11 (విధాత): అక్రమ మైనింగ్ నిర్వహించిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు విధించిన అపరాధ రుసుం రూ.94.6 కోట్లను మహారాష్ట్ర రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ మాఫీ చేసింది. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఇది కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన అఫీషియల్ ఖాతా. ‘మేఘా కంపెనీ ఇంతకు ముందే రూ.519 కోట్ల బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని మాఫీ చేసి సర్ధుబాటు చేశారు. పన్నులు చెల్లించేవారు నష్టాలు భరించాలి. లాభాలు మాత్రం పీఎం స్కేర్స్‌ (పీఎం కేర్స్‌ ను ఉద్దేశించి)లో ఉంటాయని ఎక్స్ లో కేరళ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

మహారాష్ట్ర రెవెన్యూ డిపార్ట్ మెంట్ మేఘా కంపెనీపై విధించిన రూ.94 కోట్ల అపరాధ రుసుం మాఫీ చేశారా? అని మహారాష్ట్ర ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ బుధవారం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీపై వేసిన రూ.94 కోట్ల అపరాధ రుసుం 2022లో మాఫీ చేశారా? ఒకవేళ చేస్తే యంత్రాలను సీజ్ చేశారా? అని ఆయన నిలదీశారు. బీజేపీ ఎలక్టోరల్ బాండ్లను భారీగా కొనుగోలు చేసిన మేఘాకు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే బంపర్ ఆఫర్ ఇచ్చారని ఆయన విమర్శించారు. రైతులు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మేఘాకు బంపర్ డిస్కౌంట్ ఇచ్చిందని ఆరోపించారు.

సతారా జిల్లాలోని సతారా నుంచి మాస్వద్ రోడ్డు నిర్మాణం సందర్భంగా అక్రమ మైనింగ్ నిర్వహించడంతో మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన యంత్రాలను స్థానిక తహసీల్దార్‌ సీజ్ చేసి, బ్యాంకు ఖాతాలను స్థంభింపచేశారని పవార్ అన్నారు. అంతే కాకుండా రూ.105 కోట్ల అపరాధ రుసుం విధించారని పేర్కొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో అపరాధ రుసుం మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారని, యంత్రాలను వెనక్కి ఇచ్చింది వాస్తవమేనా అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే మంత్రి బవాంకులే, మెఘా మధ్య బంధం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. జాల్నా, పర్భనీ జిల్లా కలెక్టర్లు అక్రమ మైనింగ్ కు పాల్పడిన మేఘాపై అపరాధ రుసుం విధించారని అన్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో సతారా జిల్లా కటావ్ తాలూకా తహశీల్దార్ ఆగస్టు 11, 2022 లో మెఘాకు చెందిన 16 వాహనాలను సీజ్ చేశారని రోహిత్ పవార్ అన్నారు.
మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్షర్స్ లిమిటెడ్ ప్రమోటర్స్ అయిన పమిరెడ్డి పిచ్చి రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి రూ.966 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. బీజేపీకి చెందిన బాండ్లకు రూ.584 కోట్లు, బీఆర్ఎస్ కు రూ.195 కోట్లు, డీఎంకే కు రూ.85 కోట్లు వెచ్చించారు. ఈ పార్టీలే కాకుండా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), జనసేన బాండ్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.