Land Registration | ఇక ఈజీగా భూముల రిజిస్ట్రేషన్లు.. 15 నిమిషాల్లోనే పూర్తి.. ఎప్పటినుంచంటే..
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం రోజువారీ పని వేళలను 48 స్లాట్లుగా విభజించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

- 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో 10 నుంచి స్లాట్ బుకింగ్
- తొలుత ప్రయోగాత్మకంగా అమలు
- సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఆధునీకరణ
- రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
Land Registration | తెలంగాణలో నూతన పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకటించారు. స్లాట్ బుకింగ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు. మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం రోజువారీ పని వేళలను 48 స్లాట్లుగా విభజించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలు నేరుగా registration.telangana.gov.in వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు.
స్లాట్ బుక్ చేసుకోనివారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని తెలిపారు. 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇతరులపై ఆధార పడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో ఒక మాడ్యూల్ ప్రవేశపెట్టామన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు.