Sridhar babu: మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట

మంత్రి శ్రీధర్ బాబుకు భారీ ఊరట లభించింది. కాళేశ్వరం భూ పోరాటానికి సంబంధించి ఆయన మీద నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది.

Sridhar babu: మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట

– కాళేశ్వరం భూ సేకరణ కేసు కొట్టివేత
– మంత్రితోపాటు 13 మందికి బిగ్ రిలీఫ్
– 2017లో కేసు నమోదు.. సుదీర్ఘ విచారణ
– ఇది ప్రజావిజయం: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar babu: మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం భూ సేకరణకు సంబంధించిన 2017లో నమోదు చేసిన కేసును కోర్టు కొట్టేసింది. శ్రీధర్ బాబుతో పాటు మరో 13 మంది కాంగ్రెస్ నేతలకు సైతం ఈ కేసు నుంచి ఉపశమనం దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని మంత్రి శ్రీధర్ బాబు పోరాటం చేశారు.

రైతుల హక్కులను కాపాడేందుకు వినతిపత్రాన్నిఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీధర్ బాబుతో పాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్య గౌడ్, శశిభూషణ్ కాచె, మరో 9 మందిపై కేసు నమోదుంది. ఈ కేసును విచారించిన నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం తుది తీర్పును వెల్లడించింది.

న్యాయమే గెలిచింది: శ్రీధర్ బాబు
కోర్టు తీర్పు అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. భూ పరిహారం కోసం తాము పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని.. చివరకు న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లపాటు ఈ కేసు నడిచిందని.. తాజాగా న్యాయస్థానం కొట్టివేసిందని పేర్కొన్నారు. ఇది ప్రజా విజయమని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. దీనిపై విచారణ కొనసాగుతుందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తమ ప్రాంతానికి ఒరిగిందేం లేదంటూ ఆరోపించారు. ఎంతో అన్యాయం జరిగిందని.. ప్రజలు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. కాళేశ్వరం పేరిట వేలాది ఎకరాలు రైతుల నుంచి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందన్నారు.