తెలుగునాట‌.. స‌రికొత్త‌ ’సంక్రాంతి‘ రాజ‌కీయం

  • By: sr    news    Jan 16, 2025 6:01 AM IST
తెలుగునాట‌.. స‌రికొత్త‌ ’సంక్రాంతి‘ రాజ‌కీయం
  • కొత్త రాజకీయ సమీకరణలకు సంక్రాంతి పునాది
  • ప్రధాని మోడీతో చిరంజీవి చెట్టాపట్టాలు
  • అల్లు అర్జున్ అరెస్టుతో నొచ్చుకున్న చిరంజీవి
  • రాజకీయ నాయకులపై పరోక్ష విమర్శలు

విధాత ప్రత్యేకం

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణలకు పునాది పడుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు సంక్రాంతి పండుగ రోజున జరిగిన సన్నివేశాలను రాజకీయ పరిశీలకులు ఉదహరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు చిరంజీవిని పిలిపించి మోదీతో జతకలపడంలోని ఆంతర్యం ఇదేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ వేడుకలు 2028 ఎన్నికలకు కొత్త రాజకీయ సమీకరణలకు పునాది వేసినట్లుగా వారు భావిస్తున్నారు. వచ్చే 2028 ఎన్నికల్లో బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. కొత్త శక్తులను కలుపుకుంటేనే వచ్చే ఎన్నికలనాటికి రెండు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. సినీనటుడు చిరంజీవి కూడా ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా బాగా నొచ్చుకున్నారని, కాంగ్రెసు నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఇలా చేస్తారా అని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఆ వర్గాలు తెలిపాయి.

అంతేకాదు ఒక సినిమా కార్యక్రమంలో చిన్న ఘటనను పట్టుకుని ఇంతలా వెంటపడతారా సినిమాల జోలికి రాకండి అని బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుక ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీతో బాగా దగ్గరగా ఉన్నారు. ఆయనకు సొంతంగా జనసేన పార్టీ ఉన్నా బీజేపీ, జనసేన ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నాయి. పవన్‌ కళ్యాన్‌ పార్టీ జనసేన అయినప్పటికీ బీజేపీ అగ్ర నాయకత్వం అతనిని వేరుగా చూడడం లేదు. పవన్‌ కళ్యాన్‌పై మోదీ ప్రత్యేక అభిమానం చూపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. పవన్‌ కళ్యాన్‌ కూడా మోదీని తన నాయకుడిగానే భావిస్తారు. బీజేపీ ఇప్పటికే పవన్‌ కళ్యాన్‌ ద్వారా ఏపీలో గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నది.

తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ వివాదం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరులో మునుపు ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు లేక విశ్వహిందూ పరిషత్ నాయకుడూ మాట్లాడలేదు. అయితే ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి పవన్‌ కళ్యాన్‌కు శక్తి చాలదేమోనన్న భావన బీజేపీ అగ్రనాయకత్వానికి ఉందని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు. పవన్ కల్యాణ్ కు చిరంజీవి తోడయితే ఆంధ్ర ప్రదేశ్లో బీజేపీకి తిరుగుండదని అగ్రనాయకత్వం భావిస్తున్నది. అలాగే తెలంగాణలో 8 పార్ల మెంటు సీట్లు గెలుచుకున్నప్పటికీ 2028లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కావాల్సిన శక్తి ఇక్కడి నాయకత్వానికి లేదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 8 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకున్నది. చాలా చోట్ల బీజేపీకి డిపాజిట్‌ కూడా దక్కలేదు. కానీ ఆతరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకున్నది.

అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలకువచ్చే వరకు మోదీ వర్గీకరణకు మద్దతుగా ఇచ్చిన స్టేట్‌ మెంట్‌, ఎం ఆర్‌ పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగను స్టేజీపైనే మోదీ ఆలింగనం చేసుకోవడం అనే ఈ రెండు అంశాల ప్రభావం బీజేపీ కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎస్సీల ఓటింగ్‌ భారీ ఎత్తున మోదీకి పడిందన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాలలో కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో2028 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ లో అధికారం చేపట్టాలంటే ఇక్కడున్న బీజేపీ నేతలకు ఉన్న బలం చాలదని భావించిన పార్టీ అధిష్టానం కొత్త డోస్‌ ఇచ్చే శక్తి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త డోస్‌గా పాపులర్‌ సినిమా హీరో చిరంజీవిని ప్రయోగిస్తున్నారా? అన్న సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న చిరంజీవి ద్వారా బీజేపీ తన శక్తిని వచ్చే ఎన్నికల్లో చాటాలని చేస్తుందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.

ఏపీలో కాపులు, బ్రాహ్మణులు, తెలంగాణలో మున్నూరు కాపులు, ముదిరాజ్‌లతో పాటు బీసీ నినాదాన్ని బీజేపీ ఎత్తుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడడం ద్వారా ఎస్సీలను తమ వైపుకు తిప్పుకున్న మోదీ చిరంజీవి ద్వారా కాపులు- ఇతర బీసీ కూలాలను దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాం చేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకత్వం ప్రధాని మోదీని, ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఒక్క చోటకు చేర్చారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ఈ ఇద్దరి కలయిక తెలుగు రాష్ట్రాల్లో 2028 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చే దిశగానేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.