HCU | బయటి వారికి నో ఎంట్రీ.. కంచ గచ్చిబౌలి భూములపై ఆంక్షలు

  • By: sr    news    Apr 04, 2025 8:01 PM IST
HCU | బయటి వారికి నో ఎంట్రీ.. కంచ గచ్చిబౌలి భూములపై ఆంక్షలు

విధాత: HCU కంచ గచ్చిబౌలి 400ఎకరాల భూములకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ శాఖ ఆంక్షల ఆదేశాలను జారీ చేసింది. ఆ భూముల్లోకి బయటి వ్యక్తులకు ప్రవేశించరాదని, సంబంధం లేని వాళ్ళు ఆ భూముల్లోకి వెళ్లరాదని సైబరాబాద్ మాదాపూర్ జోన్ డిప్యూటీ కమిషనర్ జి. వినీత్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ భూముల వివాదం హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందునా అక్కడ యథాతధ స్థితిని కాపాడేందుకు వాటిల్లోకి ఎవరు ప్రవేశించకుండా నిషేదాజ్ఞాలు అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. అల్లర్లు తలెత్తకుండా, చట్టబద్దమైన వారి విధులకు ఆటంకాలు కల్గకుంగా ఈ నిషేధం అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరైనా నిషేధ ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి 400ఎకరాల భూములపై యూనివర్సిటీ విద్యార్ధులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం సాగుతోంది. ఈ భూములు ప్రభుత్వ భూములంటూ వాటిని టీజీఐసీ ద్వారా అమ్మకం సాగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే అవి యూనివర్సిటీ పరిధిలోని భూములని, వాటిని అభివృద్ధి పేరిట విక్రయిస్తే వాటి పరిధిలోని అటవీ విధ్వంసమై వన్యప్రాణులు ఆవాసం కోల్పోవడంతో పాటు నగర పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాత్రికి రాత్రే జేసీబీలో ఈ భూముల చదును చేపట్టడం మరింత వివాదస్పదమైంది. దీంతో వివాదం హైకోర్టుకు చేరడం, సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించడం జరిగింది. సుప్రీంకోర్టు కంచ గచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పనులు ఆపాలని స్టే ఆర్డర్స్ ఇచ్చి నిపుణుల కమిటీని నియమించాలని, ఆరునెలల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసును ఈ నెల 16కు వాయిదా వేసింది. హైకోర్టులో కేసు ఈనెల 7వ తేదీకి వాయిదా పడింది.