Pakistan: పాక్‌ రాయబారి.. యుద్ధ రంకెలు! అణు దాడికీ వెనుకాడబోం

  • By: sr    news    May 04, 2025 6:51 PM IST
Pakistan: పాక్‌ రాయబారి.. యుద్ధ రంకెలు! అణు దాడికీ వెనుకాడబోం

మాస్కో: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్‌పై భారత్‌ దాడి చేయడం ఖాయమని ఇప్పటికే పలువురు పాక్‌ మంత్రులు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదే క్రమంలో రష్యాలోని పాక్‌ రాయబారి మహ్మద్‌ ఖలీద్‌ ఈ విషయంపై తాజాగా స్పందించారు. ఆదివారం మీడియాకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ.. పాకిస్తాన్‌పై భారత్‌ దాడి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆ దాడికి తాము గట్టిగా బదులిస్తామనీ చెప్పారు. అవసరమైతే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలూ భారత్‌పై ప్రయోగిస్తామని తేల్చి చెప్పారు.

అణ్వాయుధాలు వాడేందుకు కూడా వెనుకాడేది లేదని అన్నారు. తమ భూభాగంలోని నిర్దిష్ట ప్రాంతాలపై భారత్‌ దాడి చేసే అవకాశం ఉందనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మహ్మద్‌ ఖలీద్‌ చెప్పారు. భారతదేశపు కొన్ని మీడియా సంస్థలు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ బలాబలాలు, సంఖ్యాబలం గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. కానీ.. తమ అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించి తీరుతామని, ఈ క్రమంలో సైన్యానికి పాకిస్తాన్‌ ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని చెప్పుకొన్నారు.

ఇప్పటికే అణుదాడి విషయంలో పాకిస్తాన్‌ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ కూడా ప్రలాపనలు చేశారు. అణ్వాయుధాలతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించారు. తమ ఆయుధాగారంలో.. ఘోరి, షాహీన్, గజినీ క్షిపణులతోపాటు 130 అణ్వాయుధ వార్‌హెడ్‌లు ఉన్నాయని, వీటిని భారతదేశం కోసమే ఉంచామని వ్యాఖ్యానించారు. సింధు జలాల సరఫరాను ఆపడానికి భారతదేశం ధైర్యం చేస్తే.. పూర్తిస్థాయి యుద్ధానికి ఆ దేశం సిద్ధం కావాల్సి ఉంటుందని అబ్బాసీ హెచ్చరించారు.