Parliament Adjourned | బీహార్‌ అంశంపై అట్టుడికిన పార్లమెంట్‌.. సోమవారానికి వాయిదా

బీహార్‌లో ఎన్నికలకు ముందు ఓటర్‌ లిస్టుల సవరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలతో ఉభయ సభలు స్తంభించిపోతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం కూడా ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

  • By: TAAZ    news    Jul 25, 2025 8:46 PM IST
Parliament Adjourned | బీహార్‌ అంశంపై అట్టుడికిన పార్లమెంట్‌.. సోమవారానికి వాయిదా

Parliament Adjourned | బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో సవరణల అంశం ఐదో రోజైన శుక్రవారం కూడా పార్లమెంటును స్తంభింపచేసింది. లక్షల మంది అక్రమ చొరబాటుదారులు దేశంలో ఉన్నందుకు బాధ్యత వహించి హో మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలన్న డిమాండ్లు ముందుకు వచ్చాయి. ‘స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారి’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ‘బీజేపీ అధికార ప్రతినిధి తరహాలో ఎన్నకల ప్రధాన కమిషనర్‌ మాట్లాడుతున్నారు. బీహార్‌లోకి 56 లక్షల మంది చొరబడ్డారని కేంద్ర ప్రభుత్వం భావించిన పక్షంలో మరి హోం శాఖ ఏం చేస్తున్నట్టు? ఇది హోమంత్రి బాధ్యత. ఆయన రాజీనామా చేయాలి’ అని మొయిత్రా డిమాండ్‌ చేశారు. బీహార్‌లో 56 లక్షల బోగస్‌ ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నది. వాటిని ఇప్పటికే తొలగించింది.

బీహార్‌ విషయంలో ప్రతిపక్షాలు నిరసన కొనసాగించడంతో శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు వాయిదాలు పడ్డాయి. దీంతో శీతాకాల సమావేశాల తొలివారం తుడిచిపెట్టుకుపోయినట్టయింది. ప్రతిపక్షాలు సభా నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని మధ్యాహ్నం 2 గంటల తర్వత లోక్‌సభ సమావేశమైనప్పుడు చైర్‌లో ఉన్న జగదాంబిక పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై సమాధానం చెబుతామని ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా ఆందోళనలేంటని ప్రశ్నించారు. నిరసనలు కొనసాగడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వరుసగా ఐదో రోజు రద్దయింది. రాజ్యసభలో కూడా ఇదే వాతావరణం నెలకొన్నది. దీంతో అధ్యక్ష స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్‌శ్యాం తివారీ.. సభను సోమవారానికి వాయిదా వేశారు.

అంతకు ముందు ఉదయం.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా పలువురు ఇండియా కూటమి పార్టీల సభ్యులు ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) అని రాసిన ఉన్న పోస్టర్లను చించి.. చెత్తబుట్టలో పడేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణను నిలిపివేయాలని, దీనిపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, బడుగుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నదని ఖర్గే విమర్శించారు. తద్వారా దేశ రాజ్యాంగాన్ని సవరించి, మను స్మృతిని తీసుకురావాలని కుట్ర చేస్తున్నదని ఖర్గే ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌, బీజేపీ వంటివి ఓట్ల రద్దుకు చేస్తున్న కుట్రలకు ఎన్నికల కమిషన్‌ వంటి రాజ్యాంగ సంస్థలు మద్దతు పలకడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్నికల సంఘం బ్లాక్‌ లెవల్‌ అధికారులు తమ సొంత మనుషులతో ఫారాలు నింపిన విషయాన్ని యావత్‌ దేశం చూసింది. తద్వారా వాళ్లు సమాజంలోని బడుగు వర్గాల వారి ఓట్లను గుంజుకుంటున్నారు. ఇప్పుడు అదే పనిని ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేస్తున్నది’ అని ఆయన మండిపడ్డారు. ‘దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, పండిట్‌ నెహ్రూ వంటివారు రూపొందించిన రాజ్యాంగంపై దాడి చేసేందుకు నిత్యం కొత్త మార్గాలు కనిపెడుతూ ఉంటుంది.

ఓటరు జాబితా సవరణ ప్రజాస్వామ్యంపై దాడి అని రాసి ఉన్న బ్యానర్‌తో జరిగిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్‌, డీఎంకే, సమాజ్‌వాది, టీఎంసీ, జేఎంఎం, ఆర్జేడీ, వామపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ అని రాసి ఉన్న పత్రాలను చించివేసిన ఎంపీలు.. పార్లమెంటు ప్రాంగణంలోని మకర ద్వారం మెట్ల వద్ద ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో వాటిని పడేయడం ద్వారా నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఓట్ల రద్దును ఆపండి.. అంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ మాట వినిపిస్తున్నదని వాయనాడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు ఓటు వేసే హక్కును మన రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. పేద ప్రజల నుంచి ఆ హక్కును గుంజుకోవడం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే. ఇది ఆమోదయోగ్యం కాదు’ అని ఆమె పేర్కొన్నారు.