Mahesh Goud | ఇంతకీ మీరు రెడ్లా? ముదిరాజులా? : ఈటలకు మహేశ్‌గౌడ్‌ సూటి ప్రశ్న

ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల ఉన్నపుడు తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందని, హైడ్రా గురించి మాట్లాడే ఈటల దేవాదాయ శాఖ భూములను కబ్జా చేశారన్న కేసు ఉన్న విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీయడానికి కారణమైన కేసీఆర్ అలీబాబా చోరీస్ లో ఈటల ఒకరని విమర్శించారు

  • By: TAAZ    news    May 12, 2025 4:45 PM IST
Mahesh Goud | ఇంతకీ మీరు రెడ్లా? ముదిరాజులా? : ఈటలకు మహేశ్‌గౌడ్‌ సూటి ప్రశ్న

Mahesh Goud | సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర పదజాలంతో చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా ఫైర్ అవుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి, విప్ ఆదిశ్రీనివాస్ లు ఇప్పటికే ఈటలకు అంతే స్థాయిలో పరుష పదజాలంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా..సోమవారం పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఈటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంలేదన్న అక్రోశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలు విమర్శలతో ఆ పార్టీ అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈటల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల ఉన్నపుడు తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందని, హైడ్రా గురించి మాట్లాడే ఈటల దేవాదాయ శాఖ భూములను కబ్జా చేశారన్న కేసు ఉన్న విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీయడానికి కారణమైన కేసీఆర్ అలీబాబా చోరీస్ లో ఈటల ఒకరని విమర్శించారు. కేసీఆర్ హయంలో చేతగాని, దద్దమ్మ మంత్రులుగా ఉన్న మీరు సీఎం రేవంత్ గురుంచి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పడిపోతుందని..60 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకా..విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నందుకు పడిపోతుందా అని మహేష్ కుమార్ ప్రశ్నించారు. బీసీ బిల్లు విషయంలో బీజేపీ నేతల వైఖరిని బీసీ సమాజం క్షమించే పరిస్థితి లేదన్నారు. అసలు ఈటల రెడ్డి కులమా..ముదిరాజ్ కులమా అని ప్రశ్నించారు. తప్పులు ఎత్తి చూపండి..సద్వి విమర్శ చేయండి..అంతేగానీ స్వార్థంతో నోటికొచ్చింది మాట్లాడితే కాంగ్రెస్ కేడర్ సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

బీజేపీ ఇమడలేక..సీఎంపై విమర్శలు : ఎంపీ చామల

బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడం..వెనుక బెంచ్ కి పరిమితం చేయడంతో ఆ పార్టీపై పెంచుకున్న అసహనాన్ని ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై చూపించడం సరికాదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తో పంచాయితీ పెట్టుకున్న ఈటల బీజేపీకి వెళ్లి అక్కడ ఇమడలేకపోతున్నారని, పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని, సీఎం అయిపోవచ్చనే పిచ్చి ఆలోచనతో ఈటల ఉన్నారన్నారు. కానీ బీజేపీలోని సీనియర్ నేతలు ఈటలను లాస్ట్ బెంచ్ కు పరిమితం చేశారన్నారు. దీంతో బీజేపీలో తన పరిస్థితి అర్థం కాక పార్టీ హైకమాండ్ వద్ద మంచి మార్కులు కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఈటల విమర్శిస్తున్నారని చామల ఎద్దేవా చేశారు. లెప్ట్‌ వింగ్‌ నుంచి రైట్‌ వింగ్‌ బీజేపీలోకి పోవడం వల్ల మీ రైట్ మెదడు దొబ్బినట్లు ఉందని ఈటలకు చురకలేశారు. మీ సమస్య అంతా బీజేపీ పార్టీలో ఉందని..అక్కడనే తేల్చుకోలేదని..సీఎం రేవంత్‌ రెడ్డిని తిడితే పదవులు వస్తాయని భ్రమిస్తున్నావన్నారు. మీ అధిష్ఠానం వద్ద మంచి పేరు లేదని..మీ ప్రధాన శత్రువు బీజేపీనే అని ఈటలపై చామల వ్యంగ్యాస్రాలు వేశారు. ఈటెలకు ఏలాంటి ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ నాయకత్వానికి సూచన వచ్చిందని..బీజేపీ నాయకులతో కేసీఆర్‌కు సంబంధాలు ఉండటంతో ఆ పార్టీలో ఈటల పరిస్థితి గందరగోళంగా మారిందని..దిక్కుతోచక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నాడని ఈటలపై చామల విమర్శలు గుప్పించారు.