Bc Poru Bata: బీసీల హక్కుల సాధనకు మార్గదర్శి “బీసీల పోరుబాట”

Bc Poru Bata: బీసీల హక్కుల సాధనకు మార్గదర్శి “బీసీల పోరుబాట”

“బీసీల పోరుబాట” పుస్తకావిష్కరణలో ఈటల, మహేష్ కుమార్, దాసోజు, జాజుల

విధాత, హైదరాబాద్ : బీసీల హక్కుల సాధనకు మార్గదర్శిగా “బీసీల పోరుబాట” పుస్తకం నిలుస్తుందని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అభివర్ణించారు. ఐఏఎస్ నరహరి రచించిన “బీసీల పోరుబాట” పుస్తకావిష్కరణ కార్యక్రమం నాంపల్లిలో నిర్వహించారు. పుస్తకావిష్కరణ చేసిన బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నరహరి రచించిన 11వ పుస్తక ఆవిష్కరణ “బీసీల పోరుబాట” మా చేతుల మీదుగా చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఎవరైనా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటారని..కానీ ఐఏఎస్ గా, ఐపీఎస్ గా ఉన్నవారు, ప్రజాప్రతినిధిగా ఉన్నవారు, జడ్జిగా ఉన్నవారు తమ అభిప్రాయాలను ఒక పౌరుడిగా తెలియజేయవచ్చని నరహరి తన రచనలతో నిరూపించారన్నారు. అణిచివేతకు గురైన వారు మాత్రమే హక్కుల కోసం పోరాడుతారన్నారు. ఒకప్పుడు విద్యార్థులు కూడా సంఘాలు ఉండేవి కానీ ఈ రోజుల్లో విద్యార్థులు కంప్యూటర్ మైకంలోకి వెళ్తుండటంతో సామాజిక స్పృహ తగ్గిపోతుందన్నారు. ఇంజనీరింగ్, ఐఏఎస్, డాక్టర్ ఏది కావాలన్నా మెరిట్ కావాలి కానీ రాజకీయ నాయకులకు కూడా మెరిట్ కావాలని నేను అంటున్నానని ఈటల వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో 27 మంది ఓబీసీలను మంత్రులను చేసిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు.

పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చాలా వరకు బీసీలను ఓటు సాధనాలుగానే చూశారని..ఇప్పుడు మా వాటా మాకు కావాలి అనే స్థాయికి బీసీలు ఎదిగారన్నారు. బీసీల్లో ఐక్యతతో కూడిన పోరాటాలు రావాలన్నారు. కేంద్రం కుల గణన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమన్నారు. కుల గణన తో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచిందన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల్లో నుంచి పుట్టిందే కుల సర్వే అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లకు చట్ట బద్దత కల్పించామన్నారు. సమాజంలో ఎవరి వాట వారికే సిద్ధాంతానికి కట్టుబడి పారదర్శకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించిందని తెలిపారు.బీసీ బిల్లుకు చట్ట రూపం కల్పించి రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు బీసీలందరు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, నాయకులు కృష్ణమోహన్, మాజీ ఐఏఎస్ చిరంజీవి, పృధ్వీరాజ్తదితరులు పాల్గొన్నారు.