PDSU: యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

  • By: sr    news    Apr 21, 2025 8:56 PM IST
PDSU: యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

విధాత, వరంగల్ : పి డి ఎస్ యు కాకతీయ యూనివర్సిటీ కార్యవర్గం ఆధ్వర్యంలో రెండో గేటు ముందు యూనివర్సిటీ ల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్లే కార్డులతో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొగిలి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రభుత్వ యూనివర్సిటీలలో 1270 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధన చేస్తున్నారన్నారని చెప్పారు. వారి సమస్యలు పరిష్కరించాలని గత నెల రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూ గత మూడు రోజుల నుండి సమ్మె చేస్తున్నారని అన్నారు. ఈ సమ్మె కారణంగా విద్యార్థులకు క్లాసులు జరగకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

గత ప్రభుత్వాలు యూనివర్సిటీలలో ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. ప్రొఫెసర్లను నియమించకపోవడం వల్ల యూనివర్సిటీలలో విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లే పది సంవత్సరాలుగా క్లాసులు బోధించి విద్యార్థుల భవిష్యత్తుకి దారులు వేశారన్నారు. స్వార్థం లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. వారితో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించి తక్షణమే వాళ్లు విధుల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

విద్యార్థులకు క్లాసులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పి డి ఎస్ యు విద్యార్థి సంఘంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, రంజిత్ కుమార్, యూనివర్సిటీ కార్యదర్శి పవన్ కళ్యాణ్, నాయకులు ముషారాఫ్, ఆదిత్య, అరవింద్, ఠాగూర్, ఆకాష్, సాయి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.