బుల్లెట్ రైలులో భారత–జపాన్ ప్రధానుల ప్రయాణం

భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి టోక్యో నుంచి సెందయ్ వరకు బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. సెందయ్లో భారతీయ లోకో పైలట్లను కలుసుకుని, ALFA-X ట్రైన్‌ను పరిశీలించారు. అనంతరం సెమీకండక్టర్ ప్లాంట్ సందర్శనతో పాటు, భారత్–జపాన్ సంయుక్త విజన్, చంద్రయాన్-5 ఒప్పందం వంటి కీలక ఒప్పందాలు కుదిరాయి.

బుల్లెట్ రైలులో భారత–జపాన్ ప్రధానుల ప్రయాణం

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ అధికారిక పర్యటనలో భాగంగా శనివారం టోక్యో నుంచి సెందయ్​ వరకు బుల్లెట్ రైలులో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ప్రయాణించారు. ఈ ప్రత్యేక ప్రయాణానికి సంబంధించిన చిత్రాలను ఇద్దరు నాయకులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. జపాన్ ప్రధాని ఇషిబా ఎక్స్‌ ప్లాట్‌ఫారంలో, “ప్రధాని మోదీతో కలిసి సెందయ్ ​వైపు ప్రయాణం కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఆయనతో ఉన్నాను, ఈ రోజు రైల్లో కూడా ఆయనతోనే ప్రయాణిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. మోదీ కూడా ఫొటోలు షేర్ చేస్తూ, “మేము సెందయ్ ​చేరుకున్నాం” అని పేర్కొన్నారు.

సెందయ్ ​చేరుకున్న వెంటనే ఇద్దరు నాయకులు ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ (JR East)లో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లను కలుసుకున్నారు. అలాగే ఆధునిక ALFA-X బుల్లెట్ ట్రైన్‌ను పరిశీలించారు. రైల్వే సంస్థ చైర్మన్ ఇద్దరు ప్రధానులకు ఈ నూతన రైలు ప్రత్యేకతలు, వేగ సామర్థ్యం, భవిష్యత్ వినియోగంపై సమగ్రంగా వివరించారు.

అనంతరం మోదీ, ఇషిబా కలిసి మియాగి ప్రిఫెక్చర్‌లోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలను సందర్శించారు. వీటిలో ముఖ్యంగా సెందయ్ ​సమీపంలోని ఓహిరా గ్రామంలోని సెకండ్ నార్తర్న్ సెందయ్ ​సెంట్రల్ ఇండస్ట్రియల్ పార్క్‌లో నిర్మాణంలో ఉన్న సెమీకండక్టర్ వాఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్లాంట్‌ను తైవాన్‌కు చెందిన Powerchip Semiconductor Manufacturing Corporation (PSMC), SBI హోల్డింగ్స్, జపాన్ భాగస్వాములు కలిసి Japan Semiconductor Manufacturing Company (JSMC) అనే జాయింట్ వెంచర్ రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. జపాన్ తన సెమీకండక్టర్ పరిశ్రమను పునరుద్ధరించడంలో ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. భారత్–జపాన్ ఆర్థిక సహకారంలో సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు (AI), క్రిటికల్ మినరల్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

జపాన్, సెందయ్లోని ఒక సెమీకండక్టర్ పరిశ్రమ

శుక్రవారం జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ, ఈ రెండు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడమే లక్ష్యంగా పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. “India – Japan Joint Vision for the Next Decade: Eight Directions to Steer the Special Strategic and Global Partnership” పేరుతో కొత్త సంయుక్త విజన్‌ను ఆమోదించారు. అదేవిధంగా భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనతో పాటు చంద్రయాన్-5 మిషన్ అమలుపై కూడా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. చంద్రుడి ధ్రువ ప్రాంతాల అన్వేషణలో ISRO మరియు JAXA కలిసి పని చేయనున్నాయి.

శనివారం ఉదయం టోక్యోలో ప్రధాని మోదీ, జపాన్‌కు చెందిన 16 ప్రిఫెక్చర్ల గవర్నర్లతో భేటీ అయ్యారు. ఆర్థిక, పారిశ్రామిక మరియు ప్రాంతీయ సహకార అంశాలపై చర్చలు జరిపారు. ఇక జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ చైనాకు వెళ్లి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో పాల్గొననున్నారు.