Weather AP Telangana | తెలుగు రాష్ట్రాలతో లవ్​లో పడ్డ వానలు – అస్సలు తగ్గట్టేదుగా..!

తెలుగు రాష్ట్రాలపై వర్షాల అతి ప్రేమ ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌, ఖమ్మం, తిరుపతి జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ. అక్టోబర్‌ 18 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

  • By: ADHARVA |    news |    Published on : Oct 13, 2025 5:54 PM IST
Weather AP Telangana | తెలుగు రాష్ట్రాలతో లవ్​లో పడ్డ వానలు – అస్సలు తగ్గట్టేదుగా..!

Love-Struck Monsoon Refuses to Leave Telugu States — Yellow Alerts Issued Across AP and TS

హైదరాబాద్‌:

Weather AP Telangana | వర్షాల గాఢప్రేమలో తెలుగు రాష్ట్రాలు ‘పీకల్దాకా మునిగిపోయాయి’.  రుతుపవనాలు వలపువానలో రెండు రాష్ట్రాలు తడిసిముద్దయిపోతునేఉన్నాయి. వెళ్లిపోయాయనుకున్న రుతుపవనాలు నాలుగు రోజులు గడవకముందే ‘నిను చూడక నేనుండలేనం’టూ వెనక్కి తిరిగి వచ్చేసాయి.

వానల వలపులో తెలుగు రాష్ట్రాలు

భారత వాతావరణ విభాగం (IMD) తాజా అంచనాల ప్రకారం, రాబోయే నాలుగు నుండి ఐదు రోజులు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గాలివానతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనుండి బయటకు వచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దక్షిణ రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తూ, అక్టోబర్‌ 18 వరకు ఈ వాతావరణం కొనసాగనుందని తెలిపింది.

“రివర్స్‌ గేర్‌లో”.. మాన్సూన్‌

వాతావరణ శాస్త్రజ్ఞుల ప్రకారం, మధ్య భారత్‌లో రుతుపవనాల ఉపసంహరణ మొదలైనా, దక్షిణ రాష్ట్రాల్లో తేమ పునరుద్ధరణ కారణంగా వర్షపాతం మళ్లీ చురుకుగా మారింది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చల్లని గాలులు, మేఘావృత వాతావరణం, రాత్రి ఉరుములతో కూడిన వర్షాలు సాధారణమైపోయాయి.
హైదరాబాద్‌లో కూడా తదుపరి 2–3 రోజులు ఒక మోస్తరు నుండి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సోషల్‌ మీడియాలో  — “తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు లీజుకు తీసుకున్నట్లున్నాయం”టూ  జనాలు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.