Warangal: మూడేళ్ళ బాలికపై లైంగికదాడి యత్నం.. పరారీలో యువకుడు

  • By: sr    news    Apr 17, 2025 10:58 PM IST
Warangal: మూడేళ్ళ బాలికపై లైంగికదాడి యత్నం.. పరారీలో యువకుడు

విధాత, వరంగల్: మూడేళ్ళ బాలిక పై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం వరంగల్ నగరంలోని గిర్మాజీపేటలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి సుమారు 9:30 గంటలకు వరంగల్ గిర్మాజిపేటలో, కిరాయికి ఉంటున్న కుటుంబానికి చెందిన మూడు సంవత్సరాల వయసు కలిగిన బాలిక, తల్లితండ్రులు ఇంటి వద్ద లేని సమయంలో తన నానమ్మ వద్ద అన్నం తిని ఇంటి ఆవరణములో తన ఐదు సంవత్సరాల వయసు కలిగిన అన్నతో ఆడుకుంటూ ఉంది.

ఈ సమయంలో వారు కిరాయికి ఉంటున్న ఇంటిలోనే పై అంతస్తులో కిరాయికి ఉంటున్న పెయింటింగ్ వర్క్ చేసే ఉత్తరప్రదేశ్ కు చెందిన లల్లు రంజాన్, 33 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి, అట్టి చిన్నపిల్లలు ఇద్దరినీ బిస్కెట్ కొనిస్తానని చెప్పి తీసుకొని వెళ్లి వారికి బిస్కెట్స్ కొనిచ్చాడు. 15 నిమిషాల వ్యవధిలో తిరిగి ఇంటికి తీసుకువచ్చి తను ఉంటున్న పై అంతస్థులోకి తీసుకొని వెళ్లి ఆ మూడు సంవత్సరాల వయసు కలిగిన బాలిక తో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆ విషయం సదరు బాలిక ఆమె నానమ్మతో తెలుపగా, ఆ విషయం తెలిసిన సదరు బాలిక కుటుంబ సభ్యులు సదరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిని నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో అతడు పారిపోవడంతో బాలిక తెలిపిన విషయాలతో స్థానిక ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.