RBI | చలామణి నుంచి రూ. 2 వేల నోటును ఉపసంహరికుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ప్రజలు ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకులో ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని ఆర్‌బీఐ సూచించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు. తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను మార్చుకోవాలంటే ఏం చేయాలని తర్జనభర్జన పడుతున్నారు. రూ. 2 వేల నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఖాతాలేని వారు కూడా ఒక్కోసారి బ్రాంచ్‌ల్లో రూ. 20 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చని సూచించింది.
ఇక ఈ నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను ఆదేశించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
రూ. 2 వేల నోట్ల డిపాజిట్‌కు, మార్చడానికి బ్యాంకులు నిరాకరిస్తే.. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపు కూడా స్పందించకుంటే.. ఒక వేళ బ్యాంకు స్పందన సంతృప్తికరంగా లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీం కింద ఆర్‌బీఐ పోర్టల్‌లోని కంప్లయింట్ మేనేజ్‌మెంట్ సిస్టంలో ఫిర్యాదు చేయొచ్చు.