కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అడగండి: బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల పట్ల ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నరు. బీఆర్ఎస్ అభ్యర్ధి అసలు కార్యకర్తలనే గుర్తుపట్టలేరు

  • By: Subbu |    telangana |    Published on : Apr 25, 2024 9:37 PM IST
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అడగండి: బండి సంజయ్

*ఆ పార్టీల అభ్యర్థులపట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు

*కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగట్టండి

*4 నుండి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలనే ప్రణాళిక

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల పట్ల ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నరు. బీఆర్ఎస్ అభ్యర్ధి అసలు కార్యకర్తలనే గుర్తుపట్టలేరు… కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో, ఆయన ఎన్నడు పార్టీలో చేరారో కూడా ఆ పార్టీ కార్యకర్తలకు తెలియదు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీల కార్యకర్తలను కూడా కలవండి. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించండి. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను, గత బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలను ఎండగట్టండి. దేశానికి మోదీ ఆవశ్యకతను వివరించి బీజేపీకి ఓటేయాలని అభ్యర్ధించండి. గొడవలకు ఆస్కారం లేకుండా సుహృద్భావ వాతావరణంలో వారిని కలిసి ప్రచారం చేయండి’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

గురువారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో మండలాధ్యక్షులు, ఇంఛార్జీలు ఆపై స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సరళి, పార్టీ కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీపై బండి సంజయ్ మాట్లాడారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి బేరీజు వేస్తూ ప్రజల్లో, ఆయా పార్టీల కార్యకర్తల్లో చర్చ జరిగేలా చూడాలని కోరారు. పార్టీ కార్యకర్తలంతా పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఇంటింటికి మూడుసార్లు వెళ్లి ఓటు అభ్యర్ధించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా ఓటింగ్ పై పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ కు హాజరయ్యేలా చేయాలని, ఈసారి 80 నుండి 100 శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేసే నాయకులను ప్రత్యేకంగా సన్మానిస్తామన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేయాలని కోరారు. మండలానికి 3 చొప్పున స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని కోరారు. వచ్చే నెల 4 నుండి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీ ఎత్తున సభలు నిర్వహిస్తామని వివరించారు.