Mallikarjun Kharge : ప్రతిచోటా ఓడిపోతుంటే.. ఇక 400 సీట్లెక్కడ? : మల్లికార్జున ఖర్గే

విధాత :  కలబురగి: బీజేపీ ప్రతిచోటా ఓడిపోతుంటే.. మోదీ ఇంకా 400 సీట్లు వస్తాయని చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

Mallikarjun Kharge : ప్రతిచోటా ఓడిపోతుంటే.. ఇక 400 సీట్లెక్కడ? : మల్లికార్జున ఖర్గే
  • ప్రతిచోటా ఓడిపోతుంటే.. ఇక 400 సీట్లెక్కడ?
  • ఇండియా కూటమికి మెజార్టీకి పూర్తి అవకాశాలు
  • బీజేపీని అడ్డుకునే సామర్థ్యం కూటమికి వచ్చింది
  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు

విధాత :  కలబురగి: బీజేపీ ప్రతిచోటా ఓడిపోతుంటే.. మోదీ ఇంకా 400 సీట్లు వస్తాయని చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ( Mallikarjun Kharge )వ్యాఖ్యానించారు. శుక్రవారం తన సొంత ప్రాంతమైన కలబురగిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమికి మెజార్టీ వచ్చేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి మంచి అనుకూలమైన వాతావరణాన్ని ప్రజలు కల్పించారని చెప్పారు. ‘ఈ ఎన్నికలు దేశ ప్రజలకు, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్నాయి. మోదీ పాలనతో ప్రత్యేకించి ధరల పెరుగుదల, అధిక నిరుద్యోగితతో ఈ రోజు ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు’ అని ఖర్గే అన్నారు. అదే సమయంలో దేశ ప్రజాస్వామ్యంపైన, భారత రాజ్యాంగపైన పెను దాడి జరుగబోతున్నదని ఆయన చెప్పారు. దేశ స్వతంత్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నదని ఖర్గే విమర్శించారు. దీంతో ప్రజలు కలవరానికి గురయ్యారని, ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఫలితంగా కూటమికి మంచి అవకాశం కలిగిందని అన్నారు. ‘ఇండియా కూటమి మెజార్టీ సాధించేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే సామర్థ్యాన్ని ఇండియా కూటమి ( I-N-D-I-A) సంపాదించుకున్నది’ అని చెప్పారు. జూన్‌ 4న ఫలితాలు వెలువడే వరకూ ప్రజలు వేచి చూడాలని, ఆ తర్వాత ఫలితాలను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయన్న ప్రశ్నకు.. ‘అలా అంచనా వేయలేం. ఎందుకంటే రాజకీయాల్లో అలాంటి అంచనాలు అరుదుగా ఉంటాయి’ అని బదులిచ్చారు. బీజేపీ ఈదఫ అన్ని రాష్ట్రాల్లో సీట్లను కోల్పోబోతున్నదని చెప్పారు. ‘ప్రతి చోటా బీజేపీ  (BJP) ఓడిపోతుంటే.. ఆ పార్టీకి 400 సీట్లు వస్తాయని మోదీకి ఎలా తెలుసు?’ అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ‘ఉదాహరణకు కర్ణాటకలో 2019లో మాకు ఒక సీటు వచ్చింది. మీరు చెప్పండి మాకు ఒకటి కంటే ఎక్కువ వస్తాయో లేదో! కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు వస్తాయని ప్రహ్లాద్‌ జోషి చెబుతున్నారు. అంటే పెరిగినట్టా? తగ్గినట్టా?’ అని ఖర్గే ప్రశ్నించారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన తెలంగాణలో గతంలో తమకు రెండే సీట్లు ఉండేవని, ఇప్పుడు అక్కడ సీట్లు పెరుగుతాయని తెలిపారు.

‘తమిళనాడులో మా కూటమి భాగస్వామ్యపక్షం డీఎంకే భద్రంగా ఉన్నది. కేరళలో మాకు మరిన్ని సీట్లు వస్తాయి. మహారాష్ట్రలో మా అఘాడీ 50 శాతానికిపైగా సీట్లు గెలుస్తుంది. అన్ని చోట్లా బీజేపీకి సీట్లు తగ్గుతుంటే.. గతంకంటే ఎక్కువ సీట్లు వస్తాయని వారు ఎలా చెప్పగలరు?’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘రాజస్థాన్‌లో మాకు గతంలో ఒక్క సీటు కూడా లేదు. ఈసారి ఏడు నుంచి ఎనిమిది సీట్లలో గెలవబోతున్నాం. మధ్యప్రదేశ్‌లో మాకు గతంలో రెండు సీట్లు ఉండేవి. అక్కడ కూడా మాకు ఈసారి సీట్లు పెరుగుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో కూడా మేం పుంజుకుంటున్నాం. గతంలో వాళ్లు (బీజేపీ) వందశాతం సీట్లు గెలిచిన చోట ఈసారి వారి సంఖ్య తగ్గుతున్నది. ఏ ప్రాతిపదికన వారు 400 కు మించి సీట్లు గెలుస్తామని చెబుతున్నారు?’ అని ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు వస్తాయనేందుకు బలమైన సంకేతాలు ఉన్నాయని ఖర్గే స్పష్టంచేశారు.

READ MORE 

మోదీని ఆ దేవుడే పంపించాడట!

Lok Sabha Elections | లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిరక్ష్య‌రాసులు పోటీ..! ఆ 121 మందిలో పార్ల‌మెంట్ గ‌డ‌ప తొక్కెదేవ‌రో..?

Rahul Gandhi | అధికారంలోకి వస్తే.. చెత్తబుట్టలోకి అగ్నివీర్‌