స్వల్ప తేడాతో పడిపోయిన ప్రభుత్వాలు.. అది కాంగ్రెస్‌కూ, బీజేపీకీ అనుభవమే
ఈ ఎన్నికల్లో బీజేపీ ఊదరగొడుతున్నట్టు నాలుగు వందల సీట్లు దాటే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి పుంజుకునే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మాత్రమేనని చెబుతున్నారు.

బీజేపీ ఓటమికి 9 లేదా 10% తేడా చాలు
రుజువు చేస్తున్న గత ఎన్నికల ఫలితాలు
స్వల్ప ఓట్ల తగ్గుదలతో భారీగా సీట్లకు గండి
అది కాంగ్రెస్‌కూ, బీజేపీకీ అనుభవమే
స్వల్ప తేడాతో పడిపోయిన ప్రభుత్వాలు
న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో బీజేపీ ఊదరగొడుతున్నట్టు నాలుగు వందల సీట్లు దాటే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి పుంజుకునే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మాత్రమేనని చెబుతున్నారు. బీజేపీ ఇక తగ్గుదల ప్రభావంలో ఉన్నదని, ఇంతకు మించి పెరిగే అవకాశం ఇప్పటికైతే లేదని విశ్లేషిస్తున్నారు. అందుకు గతంలో రాజకీయ పార్టీలు సాధించిన ఓటింగ్ శాతాలను ప్రస్తావిస్తున్నారు. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ 49.10శాతం ఓట్లతో 404 స్థానాలు గెలుపొందింది. కానీ.. 1989 ఎన్నికల నాటికి 197 స్థానాలకు పడిపోయింది. కేవలం 9.57 శాతం ఓట్ల తేడాతో ఆ పార్టీ 197 స్థానాలు కోల్పోయింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 2009లో 28.55 శాతం ఓట్లతో 206 సీట్లు గెలుచుకున్నది. 2014లో 19.52 ఓట్ల శాతంతో 44 సీట్లకు దిగజారింది. అంటే.. కేవలం 9.03శాతం ఓట్ల తేడాతో ఏకంగా 162 సీట్లను కాంగ్రెస్ కోల్పోయింది. చిన్నపాటి ఓటింగ్ శాతం తేడాలు.. రాజకీయ పార్టీలను భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తాయనేందుకు ఈ శాతాలు ఉదాహరణ. అయితే.. బీజేపీ అంటకాగే ఎన్నికల విశ్లేషకులు మాత్రం 303 సీట్లతో 37.36శాతం ఓట్లతో బీజేపీ పెట్టని కోటలా ఉన్నదని బాకాలు ఊదుతున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
బీజేపీ విషయానికి వస్తే.. 1984లో బీజేపీ 7.74 ఓట్ల శాతంతో రెండు సీట్లను మాత్రమే గెలుచుకున్నది. 1989లో 11.36 శాతం ఓట్లతో 83 సీట్లకు పెరిగింది. అంటే.. కేవలం 3.62 శాతం ఓట్లతో బీజేపీ 81 సీట్లు అదనంగా గెలిచింది. 2014లో కూడా బీజేపీ 31.34 శాతం ఓట్లతో 282 స్థానాలు కైవసం చేసుకున్నది. 2009లో 18.80శాతం ఓట్లతో 116 సీట్లకే పరిమితం అయింది. అంటే.. 2014లో 12.54 శాతం ఓట్లు పెంచుకుని 166 సీట్లు అదనంగా పొందింది. దీనర్థం.. దాదాపు వందకు పైగా సీట్ల ఫలితాన్ని 9% లేదా పది శాతం ఓట్లు నిర్దేశిస్తాయని! కాంగ్రెస్ ఈ వాస్తవాన్ని ఆధారంగా చేసుకునే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో తాము కనీసం 5 శాతం ఓట్లను పెంచుకోగలమనే విశ్వాసాన్ని కాంగ్రెస్ వ్యూహకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి తాము పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యాంటిఇంకంబెన్సీ ప్రభావం అనేది ఇప్పుడు ఉండదని వారు ప్రస్తావిస్తున్నారు. అందులోనూ ఈసారి గతంలో ఉన్నట్టు పుల్వామా, బాలాకోట్ వంటి భావోద్వేగ అంశాలు కూడా ఏమీ లేవని వారు చెబుతున్నారు. నరేంద్రమోదీ తొలి రోజుల్లో అయోధ్య రామాలయం అంశాన్ని బాగా ప్రస్తావించినా.. అది పెద్దగా ఓట్లు రాల్చే అవకాశం లేదని తేలిపోవడంతోనే వ్యూహం మార్చి, హిందూ, ముస్లిం అంశాలపై కేంద్రీకరించారని విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే.. జాతీయవాదం, ఉగ్రవాదం, హిందూ, ముస్లిం అంశాలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ గత పదేళ్లలో ప్రతి ఎన్నికల్లోనూ అవే అంశాలను ప్రస్తావిస్తుండటాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని, అవి వినీ వినీ విసుగెత్తిపోయి ఉన్నారని అంటున్నారు. ప్రజలకు తమ ప్రాథమిక అవసరాలైన కూడు, గుడ్డ, నీడ కీలకం అవుతాయి కానీ.. భావోద్వేగా అంశాలు వాటిపై పనిచేయవని స్పష్టం చేస్తున్నారు.
అనేక మంది కాంగ్రెస్ నాయకులు తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే తమ ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల, తీవ్రంగా ఉన్న నిరుద్యోగిత, తాము ఎన్నికల్లో ఇచ్చిన కులగణన హామీ, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనే ప్రచారం తమకు కలిసి వస్తాయని చెబుతున్నారు. కూటమి పక్షాల కారణంగా మరో ఐదు శాతం ఓట్లు పెరుగుతాయని అంటున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ పార్టీ అక్కడి కీలక పక్షాలతో పొత్తులు పెట్టుకోవడంలో విజయవంతమైంది. గుజరాత్‌లో కూడా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీచేస్తున్నది. భాగస్వామ్య పక్షాల మధ్య ఓటు బదిలీ సమర్థవంతంగా జరిగితే పదిశాతానికిపైగానే ఓట్లు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా కాంగ్రెస్ ఓటు శాతం 30కి పెరుగుతుందని చెబుతున్నారు. ఇది 80 నుంచి 100 సీట్లలో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చివేస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. 30 శాతం ఓట్లు తెచ్చుకోగలిగితే తమకు 150 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. బీజేపీ పదిశాతం ఓట్లు కోల్పోయి 200 సీట్లకు పడిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి బీజేపీకి ఓట్లు, సీట్లు పెరుగుతాయని ఎవరూ చెప్పడం లేదని అన్నారు. ‘మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో వారికి భారీగా సీట్లు తగ్గుతాయి. హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కూడా వారికి కొన్ని సీట్లు తగ్గటం ఖాయం’ అని ఆయన వివరించారు. ఒడిశా, కొంత మేరకు తెలంగాణలో వారికి సీట్లు పెరిగినా అది పెద్దగా పరిగణనలోకి తీసుకునేది కాదని చెప్పారు. ‘జారడం అంటూ మొదలైతే.. కొన్ని అంగుళాలు పడిపోతాం అనేకుంటే తప్పవుతుంది. సాధారణంగా పతనం అనేది ఉంటే భారీగానే ఉంటుంది. ప్రస్తుత ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో సందేశాలు చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఈ సందేశం దేశం నలుమూలలకు ఇప్పటికే విస్తరించిందని, బీజేపీ పని అయిపోతున్నదని మాకు తెలుసు. తక్కువ మెజార్టీతోనైనా తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ.. రాజకీయాల్లో ఒకసారి దొర్లి పడ్డారంటే.. అది అత్యంత ప్రమాకరపరిస్థితుల్లోకి వెళ్లడమే’ అని ఆయన అన్నారు. హర్యానాలో క్షేత్రస్థాయిలో గణనీయ మార్పులు కనిపిస్తున్నాయని సదరు నాయకుడు చెప్పారు. తొలుత ఒకటి రెండు సీట్లు అక్కడ తమకు వస్తాయని భావించినా.. ఇప్పటి పరిస్థితులు గమనిస్తే కనీసం ఏడెనిమిది సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానాలోనే తాను ఏడెనిమిది సీట్లు గెలిచామంటే.. బీజేపీ దేశవ్యాప్తంగా సుమారు వంద సీట్లు ఓడిపోవడం ఖాయమని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కూడా పెరిగే సీట్లపై కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను బీఎస్పీ కనుక చీల్చితే తమకు మూడు నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ భావించాయని, కానీ.. ఇప్పుడు అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో 60శాతం ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా ఉన్నారని తెలుస్తున్నదని పేర్కొన్నారు. యూపీలో ఈసారి బీజేపీ 40 సీట్ల కంటే తక్కువకు పడిపోయినా ఆశ్చర్యం లేదని అన్నారు. ప్రధాన స్రవంతి మీడియాలో చూపిస్తున్నదానికంటే దేశవ్యాప్తంగా పోటీ చాలా గట్టిగా ఉన్నదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తెలిపారు. చాలా సీట్లలో ఫలితం అనూహ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగిత, అగ్నివీర్ పథక్, రాజ్యాంగానికి పొంచి ఉన్న ముప్పు మోదీకి వ్యతిరేకంగా మారాయని ఆయన చెప్పారు. అవి బీజేపీ 400 సీట్ల ఆశలను గల్లంతు చేశాయని అన్నారు.