Seethakka: వచ్చే మహా మేడారం జాతరకు.. రూ.145 కోట్లు

- రానున్న జాతరకు శ్వాశ్వత పనులు
- ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనులు
- ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు సమర్పించాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
విధాత ప్రత్యేక ప్రతినిధి: వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే మేడారం మహా జాతర వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్వాశ్వతoగా నిలిచేలా పనులు పూర్తి చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మహా జాతరకు ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 145 కోట్ల రూపాయలను కేటాయించనున్నదని తెలిపారు. మంగళవారం ములుగు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధ్యక్షతన 2026 సంవత్సరంలో జరగనున్న మేడారం మహా జాతరను పురస్కరించుకొని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు చేపట్టనున్న పనులను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో లాగా జాతరకు రెండు నెలల ముందు పనులు ప్రారంభించి హడావుడిగా పనులు పూర్తి చేయకుండా కనీసం ఆరు నెలల సమయం తీసుకుని పూర్తి నాణ్యత పనులు ముగించాలని సూచించారు. వచ్చే సంవత్సరంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తో పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నందున అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గత మహా జాతర సందర్భంగా మిగిలి ఉన్న 50 కోట్ల రూపాయలను రానున్న జాతరకు వినియోగిస్తామని తెలిపారు. గద్దెల పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దరమే కాకుండా జంపన్న వాగుపై ఐదు కోట్ల రూపాయలతో పెద్దలు పిల్లలు సేద తీర్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని, ప్రణాళిక బద్ధంగా శాశ్వత పనులు చెయ్యాలని ఆదేశించారు.
జాతర సందర్భంగా త్రాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ గత జాతర సందర్భంగా పనిచేసిన వారి అనుభవాలను పరిగణలోకి తీసుకొని రానున్న జాతరను పూర్తి చేస్తామని అన్నారు. పలు శాఖల ద్వారా చేపట్టనున్న పనులను గుర్తించి అంచనాలను తయారు చేస్తామని, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ రెవిన్యూ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ములుగు డిఎస్పి రవీందర్, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఎఫ్ డి ఓ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.